బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!
Publish Date:Jul 17, 2026
Advertisement
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న *యువ సంగ్రామ సభ' కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. విచారణ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, కార్యక్రమం నిర్వహించేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వెంటనే అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించాయి. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు సభ నిర్వహణకు అనుమతి ఇస్తూనే పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ కారణంగా జాతీయ రహదారి లేదా ఇతర ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేలను దిగ్బంధించరాదని స్పష్టం చేసింది. అలాగే సభ నిర్వహణ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కార్యక్రమాన్ని నిర్వహిం చాలని, సభ నిర్వాహకులు పోలీసులు సూచించే అన్ని నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, జనస మ్మర్ద నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కూడా సూచించింది. హైకోర్టు అనుమతితో శనివారం (జూలై 18) సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలు, యువ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సభ నిర్వహణకు పోలీసులు కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టే అవకాశముంది. BRS Youth Sangram Sabha, Telangana High Court, Saroornagar Indoor Stadium, BRS Party, KCR, KTR, CM Revanth reddy
http://www.teluguone.com/news/content/brs-youth-sangram-sabha-25-226306.html




