బీఆర్ఎస్‌లో భారీ మార్పులు… కమిటీలన్నీ రద్దు!
Publish Date:Apr 27, 2026
Advertisement
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.
http://www.teluguone.com/news/content/brs-state-level-committee-25-218396.html





