కవితకు నో బెయిల్.. కేసీఆర్ మౌనంపై కార్యకర్తలు గుస్సా
Publish Date:Aug 12, 2024
Advertisement
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు వీడటం లేదు. ఆమెకు బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ కేసులో 17నెలలుగా జైల్లో ఉంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే కేసులో ఐదు నెలలుగా తీహార్ జైల్లోఉంటున్న కవితకు కూడా బెయిల్ వస్తుందని అందరూ భావించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కవిత సోదరుడు కేటీఆర్ కూడా వారం రోజుల కిందట మీడియా చిట్ చాట్ లో సోమవారం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. కవిత జైలు నుంచి బెయిల్ పై బయటకు రాబోతున్నారని అంతా భావించారు. బెయిల్ ప్రకటన రాగానే రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, బీఆర్ ఎస్ శ్రేణుల ఆశలు అడియాశలయ్యాయి. మద్యంత బెయిల్ కోరుతూ కవిత సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ పై సోమవారం విచారణ జరిగింది. కానీ, కవితకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆగస్టు 20వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో కవిత ఐదు నెలలుగా జైల్లో ఉంటున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉంటుండటంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర స్థాయిలో రాజకీయ పలుకుబడి ఉండి.. రాబోయే రోజుల్లో దేశానికి ప్రధాని అయ్యేది తానే అని గత ఎన్నికల సమయంలో చెప్పుకున్న కేసీఆర్.. కుమార్తె ఐదు నెలలుగా జైల్లో ఉన్నా విడిపించేందుకు ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని పార్టీ శ్రేణులలో అసహనం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి కుమార్తెను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితోపాటు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేక పోయింది. దీంతో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఊసే లేకుండా పోయింది. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్ పేరును దాదాపు మర్చిపోయారు. ఆయన పలుకుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా తన కుమార్తెను జైలు నుంచి విడిపించుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. ఈ విషయాన్నే పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. అంతేకాదు, కుమార్తె అరెస్ట్ అయితే ఏ తండ్రికి అయినా బాధ ఉండదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అగ్నిపర్వతంలా రగిలి పోతున్నా సైలెంట్‌గా ఉండక తప్పడం లేదని కేసీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టే కేసీఆర్ ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నారన్నది అర్ధమౌతుంది. కవిత విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ప్రస్తుతం కేసీఆర్ వ్యవహారశైలి పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమౌతోంది. ఓటమి తరువాత పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో బీఆర్ఎస్ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడుతున్నారు. పార్టీ సమావేశాల్లోనూ పాల్గొనేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తిచూపడం లేదని తెలుస్తోంది. ఎవరైనా కేసీఆర్ వద్దకు వెళ్లి మాట్లాడితే తప్పితే, కేసీఆర్ స్వయంగా నేతలను పిలిపించుకొని సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి సూచనలు చేయడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో కేసీఆర్ తీరుపై పార్టీ శ్రేణులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లోకి రాకుండా ఉండటం ఏమిటని కేసీఆర్ తీరును కొందరు నేతలు తప్పుపడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కుట్రలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వేధింపులకు గురయ్యారు. అక్రమంగా అరెస్టై జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయినా, చంద్రబాబు ఎక్కడా ఢీలా పడకుండా తన అపార రాజకీయ అనుభవంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా చంద్రబాబు పద్దతిని అవలంభించాలని, ఎన్నికష్టాలు ఎదురైనా పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం ఇంటికే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కవిత బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాతే పార్టీ నేతలకు కేసీఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసిఆర్ పెద్దగా ఆసక్తి చూపడంలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక పక్క అధికార పార్టీ దూకుడుతో వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి. దీంతో బీఆర్ ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే పది మందికిపైగా చేరగా.. మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కవితకు బెయిల్ వచ్చే వరకు కేసీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుంటే కీలక నేతలంతా పార్టీని వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి నుండైనా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపకుంటే రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పట్టు కోల్పోవడం ఖాయమన్న వాదన ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. మరి కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు..? పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని ఎప్పుడు నింపుతారో వేచి చూడాల్సిందే
http://www.teluguone.com/news/content/brs-cadre-angry-on-kcr-silence-25-182834.html





