బొత్స అండ్ కిరణ్ ఆర్ నవ్ ఫ్రెండ్స్
Publish Date:Oct 31, 2013
Advertisement
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ విభజనకు వ్యతిరేఖంగానో, అనుకూలంగామాట్లాడుతూనో అదీ వీలుకాకపోతే ఇంట్లో దుప్పటి ముసుగేసి పడుకొనో కాలక్షేపం చేసేస్తున్నారు. కానీ పాపం! బొత్సబాబుకే ఏమి మాట్లాడాలో తెలియక, ఏదేదో మాట్లాడేస్తూ తన ఆ జ్ఞానమంతా బయటపెట్టేసు కొంటున్నారు. తను సమైక్యవాదినని చెపుతూనే ఇక డెఫినెట్గా విభజన జరిగిపోతుందని చెపుతారు. తనకు ముఖ్యమంత్రిపై ఆశ ఉందని, అందుకే రాష్ట్ర విభజనకు కేంద్రాన్ని ప్రోత్సహించానని పార్టీలో బయట కూడా కొందరు మతి స్థిమితం లేని వాళ్ళు అవాకులు చవాకులు వాగుతున్నారని అంటారు. ఆ వెంటనే 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే మాట మరిచిపోకుండా కలుపుతుంటారు. తను పీసీసీ అధ్యక్షుడినని గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళని చూడకుండా “పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే బయటకి పొండి” అని చిందులు వేసిన తరువాత, వాళ్ళు కూడా తనకంటే సీనియర్స్ అనే సంగతి గుర్తుకు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి “నా ఉద్దేశ్యం అదికాదు...” అంటూ ఏవో సంజాయిషీలు ఇస్తూ మరింత గందరగోళం సృష్టిసారు. ఫేస్ బుక్కులో తండ్రి కొడుకులో లేక అన్నదమ్ములో లేక మొగుడు పెళ్ళాలో ఇవాల్టి నుండి ఫ్రెండ్స్ అని మెసేజ్ ఏవిధంగా వస్తుందో అదేవిధంగా ఇప్పుడు బొత్స అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ నవ్ ఫ్రెండ్స్ అని ఆయన ప్రస్తుతం చెప్పుకొంటున్నారు. అలాగని కిరణ్ కుమార్ రెడ్డిని అనుసరించే దైర్యం ఉందా? అంటే అదీ అనుమానమే. ఎందుకంటే అధిష్టానం చల్లగా చూస్తే నేడు కాకపోతే రేపు రాష్ట్రం విడిపోయిన తరువాతయినా ముఖ్యమంత్రి అవకపోతానా అనే ఆలోచన ఉంది కదా! అటువంటప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటి ముఖ్యమంత్రి పదవి గట్టిగా పట్టుకొని సమైక్యంగా ముందుకు సాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి చేయి పట్టుకొని ముందుకు సాగడం అంటే, ఇక శాశ్వితంగా రవాణా శాఖకే కమిట్ అయిపోయే ప్రమాదం ఉంది. అయితే దివాకర్ రెడ్డిని అన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డిని ‘పార్టీలో నుండి బయటకి పొమ్మనే’ సాహసం చేయలేక బొత్స అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ నవ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొంటున్నారనుకోవాలి. ఒకవేళ అధిష్టానం “రిప్లేసింగ్ కిరణ్ కుమార్ రెడ్డి సూన్” అని మెసేజ్ ఏమయినా పెడితే, అప్పుడు ఆయన ‘నెట్ వర్క్’ లో మార్పులు ఏర్పడవచ్చును. ఏమయినప్పటికీ ఆయన ఈ విషయంలో చిరంజీవికి ఈ మాత్రం తీసిపోరని మాత్రం గట్టిగా చెప్పవచ్చును.
http://www.teluguone.com/news/content/botsa-39-27052.html