వైసీపీలో అంతే.!
Publish Date:Aug 5, 2026
Advertisement
వైసీపీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులు మరోసారి బహిర్గతమయ్యాయి. గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, పార్టీ కోసం ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్.. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తన భార్యతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. వైసీపీ అగ్రనాయకత్వం తనను వాడుకుని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చేపట్టిన ఈ ధర్నా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై బోరుగడ్డ అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ టైమిస్తే.. గంట, అరగంటలో చంద్రబాబు, లోకేష్ లను లేపేస్తానంటూ బోరుగడ్డ నోటికొచ్చినట్లుగా దూషణలు చేశారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయితే.. ఇప్పుడు వైసీపీ నాయకత్వం తనను పూర్తిగా పక్కన పెట్టిందని బోరుగడ్డ అనిల్ ఆరోపిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసుకు వెళ్తే కనీసం లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని.. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణ రెడ్డి తనను తీవ్రంగా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద గంటల తరబడి వేచి చూసేలా చేసి, నువ్వు ఎవరు? అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరఫున తాను కేసులు ఎదుర్కొని జీవితాన్ని నాశనం చేసుకుంటే, ఇప్పుడు తనను రౌడీషీటర్‌గా ముద్రవేసి దూరం పెట్టడం దారుణమంటూ బేల మాటలు మాట్లాడారు. వైఎస్ జగన్ ఇంటి ముందే ప్రాణాలు వదులుతానని, తనకు న్యాయం జరగకపోతే వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కారుమూరి వెంకట్ రెడ్డి వంటి నేతలు సైతం తనను కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆడియో సాక్ష్యాలను బయటపెట్టారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగువన్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్ వైసీపీలో ఇది సహజ పరిణామమేనని విశ్లేషించారు. శ్రీరెడ్డి, వర్రా రవీంద్రరెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటి వారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని, ఆ తర్వాత చేతులెత్తేయడం వైసీపీ అగ్రనాయకత్వానికి అలవాటేనని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గతంలో విజయసాయి రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి సీనియర్లు సైతం పార్టీలోని కోటరీ వల్ల తీవ్ర అవమానాలకు గురయ్యారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పెంచి పోషించిన నాయకులే ఇప్పుడు వారిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుండటం కర్మ ఫలమని విశ్లేషించారు. పార్టీ కోసం సర్వస్వం కోల్పోయిన కార్యకర్తలకు, మద్దతుదారులకు ఈ పరిణామాలు ఒక హెచ్చరిక లాంటివని పేర్కొంటున్నారు. అయితే బోరుగడ్డ ఇలా రోడ్డున పడటానికి కారణం స్వయంగా జగనేనని డీవీ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ కోసం పాదయాత్ర చేసిన షర్మిల ఉదంతాన్ని గుర్తు చేశారు. తాడేపల్లిలో బోరుగడ్డ అనిల్ దంపతుల ధర్నా వైసీపీ కోటరీ రాజకీయాలను మరోసారి ఎండగట్టిందన్న ఆయన రాబోయే రోజుల్లో ఇలాంటి అసంతృప్తులు మరిన్ని బయటపడే అవకాశం ఉందని చెప్పారు. Borragadda Anil Dharna, Tadepalli YCP Office Protest, Borragadda Anil Vs Sajjala, YS Jagan Mohan Reddy,AP Political Updates, Telugu One
http://www.teluguone.com/news/content/borragadda-anil-dharna-25-228080.html





