బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలనం..!
Publish Date:Sep 9, 2026
Advertisement
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..! బొల్లారం ఆర్మీకి చెందిన ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఆయుధాలు ఒకేసారి చోరీ కాలేదని, గత మూడు నెలలుగా ఒక్కొక్కటిగా దశలవారీగా మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బొల్లారంలోని ఆర్మీ ప్రాంగణంలో ఇటీవల నిర్వహించిన ఆయుధాల ఆడిట్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి కనిపించకపోవడం వెలుగులోకి వచ్చింది. గత వారంలో చేపట్టిన ఆడిట్ సందర్భంగా అసలు విషయం బయటపడింది. మొత్తం నాలుగు ఏకే-47 రైఫిల్స్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, తొమ్మిది పిస్టల్స్‌తో పాటు సుమారు 2,000 బుల్లెట్లు కనిపించకుండా పోయినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆయుధాలు, బుల్లెట్లు ఒకేసారి అదృశ్యం కాలేదని.. గత మూడు నెలలుగా దశలవారీగా ఒక్కొక్కటిగా మాయమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆయుధాల భద్రత, స్టాక్ నిర్వహణ, ఆయుధాల రాకపోకలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయుధాలు కనిపించకుండా పోయిన తర్వాత వాటిని బయట వ్యక్తులు చోరీ చేసినట్లు కనిపించేలా ‘సీన్ క్రియేట్’ చేసినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసులో ‘బయటి వ్యక్తుల’ ప్రమేయం కంటే ఆర్మీకి సంబంధించిన అంతర్గత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి సారించారు. మాయమైన ఆయుధాలు, బుల్లెట్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎవరు తరలించారు? ఎందుకు దశలవారీగా బయటకు తరలించారు? అనే కోణాల్లో మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అదుపులో ఉన్న ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును మిలటరీ ఇంటెలిజెన్స్‌తో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మాయమైన ఆయుధాలు ఎక్కడికి చేరాయన్న అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. (Bollaram Army weapons theft case, NIA, Military Intelligence, indian army, PM MODI, Home minister amit shah, Telugu One, Telugu News)
http://www.teluguone.com/news/content/bollaram-army-weapons-theft-case-36-231111.html




