ఉప్పల్ స్టేడియం వద్ద జోరుగా బ్లాక్ టికెట్ల దందా
Publish Date:May 21, 2026
Advertisement
రేపు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భారీగా బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. ముఖ్యంగా స్టేడియం గేట్ నెంబర్-2 వద్ద టికెట్ల అక్రమ విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. వెయ్యి రూపాయల అసలు ధర ఉన్న టికెట్లను రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్న ముఠాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. అలాగే రూ.10 వేల విలువైన ప్రీమియం టికెట్లను లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు అమ్ముతున్నట్లు అభిమానులు చెబుతున్నారు. ముందుగానే పెద్ద మొత్తంలో టికెట్లు కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు వాటిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక టికెట్ల విక్రయాలపై కూడా అభిమానులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 39 వేల టికెట్లు కేవలం మూడు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయని ప్రకటించిన డిస్ట్రిక్ యాప్‌పై అభిమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మూడు నిమిషాల్లో అంత భారీ సంఖ్యలో టికెట్లు ఎలా అమ్ముడయ్యాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్లు నిజంగా అభిమానులకు అమ్మాయా..? లేక బ్లాక్ మార్కెట్‌కు మళ్లించారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మ్యాచ్ టికెట్ల కోసం భారీ సంఖ్యలో అభిమానులు ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. గేట్ నెంబర్-2 వద్ద అభిమానులతో భారీ రద్దీ నెలకొంది. అదే సమయంలో అక్కడే బ్లాక్ టికెట్ల విక్రయాలు జరుగుతుండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, నిర్వాహకులు తక్షణమే చర్యలు తీసుకుని బ్లాక్ టికెట్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/black-ticket-scam-rampant-at-uppal-stadium-36-220523.html





