ఇదేం రుబాబు రఘునందనా?
Publish Date:Mar 15, 2025
.webp)
Advertisement
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి, ఆంధ్రప్రదశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అల్టిమేటమ్ జారీ చేసినట్లుగా మాట్లాడారు. ఈ వేసవి సెలవుల్లో తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ అంగీకరించకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిథులం అందరం తిరుమల వచ్చి చేయగలిగింది చేస్తామని హెచ్చరించారు. అసలాయన ఎక్కడి వారు, ఎక్కడకు వచ్చి ఏం మాట్లాడారు? అంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి పద్మారావు వంటి వారు కూడా తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ కూడా రాశారు. ఆ లేఖపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం ఫిబ్రవరి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలను తిరుమలలో పరిగణనలోనికి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు తాజాగా మార్చి నెల సగం గడిచిపోయిన తరువాత కూడా తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫా రసు లేఖను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ రఘునందనరావు తిరుమలలో రుబాబు చేశారు. శుక్రవారం (మార్చి 14)న ఆయన తిరుమలేశుని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిథి హోదాలో ఆయనకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం కల్పించింది. అయితే ఆయన సిఫారసు లేఖలకు అనుమతిపై ఏపీ సర్కార్, టీటీడీపై విమర్శలు గుప్పించడమే కాకుండా హెచ్చరిక కూడా జారీ చేశారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలోని మొత్తం 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించేది. వారి సిఫారసు లేఖల మేరకు భక్తులకు దర్శనం కల్పించేది. అయితే రాష్ట్ర విభజన తరువాత తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలా వద్దా అన్నది పూర్తిగా టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిం చుకోవలసిన అంశం. దీనిపై పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిథులు రుబాబు చేయడం పూర్తిగా అనుచితం అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో రఘునందనరావుపై విరుచుకుపడుతున్నారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం పది శాతం మంది భక్తులకు మాత్రమే రాష్ట్రప్రజాప్రతినిథుల లేఖల ద్వారా బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం లభ్యమౌతోంది. మిగిలిన 90శాతం మందీ కూడా సామాన్య భక్తులే. అయినా టీటీడీలో శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రాల వారీ కోటా ఏమీ లేదు. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిథులు తమ లేఖలను పరిగణనలోనికి తీసుకోవాలంటే హఠం చేయడం ఎంత వరకూ సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా తిరుమలేశుని దర్శనం కోసం టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రాల వారీ రిజర్వేషన్లు ఏమీ ఉండవు. అంటే తెలంగాణ భక్తులు కానీ మరో రాష్ట్రం భక్తులు కానీ తిరుమలేశుని దర్శనం విషయంలో వివక్షకు గురి కావడం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వాసులకు ప్రత్యేక వెసులుబాటు కూడా ఏమీ లేదు.
తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమల వచ్చిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తోంది. ఇప్పుడు రఘునందరనావు కూడా కుటుంబ సమేతంగా వతిరుమలలో వీఐపీ దర్శనం చేసుకున్నారు. ఇక సిఫారసు లేఖలను కూడా అనుమతించాలని పట్టుబట్టడంలో అర్ధం లేదని నెటిజనులు విమర్శిస్తున్నారు. సామాన్య భక్తులకు సత్వర దర్శన భాగ్యం కల్పించడంపైనే టీటీడీ దృష్టి సారించాలని కోరుతున్నారు. రఘునందనరావు తిరుమలలో చేసిన రుబాబు ఆయన స్థాయికి తగినట్లుగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-mp-raghunandanarao-ultimatum-to-ap-government-and-ttd-39-194437.html












