కాంగ్రెస్ ద్రౌపది వస్త్రాపహారణ..వివాదాలకు చిరునామా
Publish Date:Jan 25, 2019
Advertisement
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరిగాయని,వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని పలుమార్లు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ నిరసనకు దిగారు కాంగ్రెస్ నేతలు. ఆందోళన పర్వం చర్చానీయాంశంగా మారింది. దానికి కారణం అసెంబ్లీ ఎన్నికలను అపహాస్యం చేశారంటూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహారణతో పోల్చుతూ ఫ్లెక్సీ కట్టారు. "మహాభారతంలో ద్రౌపది.. తెలంగాణలో ప్రజాస్వామ్యం" అనే టైటిల్ పెట్టారు. ఓట్లను ద్రౌపదితో పోల్చుతూ.. ERO, DRO, CEO లను దుశ్శాసనుడి కింద లెక్కగట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ధృతరాష్ట్రుడిగా చిత్రీకరించారు. సీఎం కేసీఆర్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ల కార్టూన్ ఫోటోలను కూడా చేర్చారు. అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా ఫ్లెక్సీని రూపొందించారు. ప్రస్తుతం ఈ ప్లెక్సీ వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపిన విధానం సరిగ్గా లేదంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మహిళ అయిన ద్రౌపది బొమ్మతో కాంగ్రెస్ వారు నిరసన తెలిపి మహిళల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరించారని చెప్పిన బీజేపీ నేత కృష్ణసాగర్ రావు... ఒక మహిళ అయిన ప్రియాంకా గాంధీ ఈ చర్యను ఆమోదిస్తుందా అంటూ ప్రశ్నించారు.ఇదిలా ఉంటే అసదుద్దీన్ ఓవైసీ కూడా కాంగ్రెస్ చర్యను తప్పుబట్టారు. మహిళలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ధ్వజమెత్తారు ఓవైసీ. నిరసన తెలిపేందుకు తప్పుడు పోస్టరు వినియోగించారని ఆయన మండిపడ్డారు. నిరసన తెలపాల్సిన పద్ధతి ఇదికాదని హితవు పలికారు. సోనియా గాంధీ, లేదా ప్రియాంకా గాంధీ, లేదా రాహుల్ గాంధీల కార్టూన్లు ఇలా తయారు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపాలంటే ఎలాగైనా తెలపొచ్చు కానీ మహిళలను కించపరిచేలా ఉండకూడదని ఓవైసీ పేర్కొన్నారు. మరోవైపు తాము చేపట్టిన నిరసన ప్రదర్శనను సమర్థించుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఛీఫ్ మర్రి శశిధర్ రెడ్డి. పోస్టరులో ఉన్నది తమకేదీ తప్పుగా అనిపించలేదన్నారు. రాహుల్ గాంధీ నుంచి క్షమాపణ చెప్పించేందుకు బీజేపీ కష్టపడుతున్నట్లు ఉందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తను కూడా ఓ హిందువునని హిందువుల మనోభావాలు దెబ్బతినే చర్యలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడదని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉందో ఆ పోస్టరు సింబాలిక్‌గా చెబుతోందని అన్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో విఫలమైందని మర్రి శశిధర్ రెడ్డి ధ్వజమెత్తారు. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహారణ ఘట్టాన్ని ఇలా నిరసనలకు వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తెం కాదు. గతంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగానికి అడ్డుపడుతూ కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి బిగ్గరగా నవ్వారు. దీంతో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ నేపథ్యంలో మహిళను ప్రధాని అవమానపరిచారంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. రేణుకాచౌదరిని ద్రౌపదిగా, రాహుల్ గాంధీని కృష్ణుడిగా మోదీ, అమిత్ షా, కిరణ్ రిజుజును కౌరవులుగా చిత్రీకరించిన ఆ ఫోటో అప్పట్లో సంచలనంగా మారింది. వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.
http://www.teluguone.com/news/content/bjp-leaders-fires-on-congress-protest-with-draupadi-vastraharan-poster-39-85519.html





