బీజేపీ డబుల్ ఇంజిన్.. కేసీఆర్‌కు డబుల్ ట్రబుల్!?
Publish Date:Mar 16, 2022
Advertisement
ఎన్నికల రాజకీయాల్లో ఒకటే సూత్రం అంతటా వర్తించదు. అలాగే పనిచేయదని రూలవుట్ చేయడం కూడా కుదరదు. ఏ ఎన్నికను ఆ ఎన్నికగా ప్రత్యేకంగానే చూడాలని అంటారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, డబుల్ ఇంజన్ సర్కార్’ నినాదాన్నికొత్తగా తెర మీదకు తెచ్చింది. అంటే, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, కాబట్టి, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని యూపీలోనూ గెలిపించాలని, ప్రధాని నరేంద్ర మోడీ మొదలు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వరకు అందరూ అదే ప్రచారం చేశారు. అయితే, ఆ ఒక్క నినాదంతోనే యూపీలో బీజేపీ గెలిచిందా.. ఎస్పీ కూటమి ఓడిపోయిందా అంటే లేదు. కమలనాధుల గెలుపునకు, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ఓటమికి.. కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయని అంటారు. అదలా ఉంటే, యూపీలో వర్కౌట్ అయిన, డబుల్ ఇంజిన్ థియరీ గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, కూడా డబుల్ ప్రస్తావన చేశారు. అయితే, డబుల్ ఇంజిన్ థియరీ/నినాదం ఇప్పుడే కొత్తగా వచ్చిందా అంటే, లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ఇతర ప్రతిపక్ష పార్టీ టికెట్ ఫై గెలిచిన ఎమ్మెల్యేలలో (రెండు అసెంబ్లీ టర్ములు కలిపి) సుమారు,50 మంది వరకు అధికార తెరాసలో చేరారు. ఇందులో ఒకరిద్దరు మినహా, మిగిలి ప్రతి ఒక్కరూ, ఫిరాయింపుకు చెప్పిన ప్రధాన కారణం, నియోజక వర్గ అభివృద్ధి. అంటే అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, దానికి ‘రాజకీయ పునరేకీకరణ’ అనే ముద్దు పేరు తగిలించిన తెరాస నాయకత్వం కూడా, బంగారు తెలంగాణ కోసమే, ఆపరేషన్ ఆకర్ష్’ పథకం అని చెప్పుకొచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక సందర్భాలలో ఫిరాయింపులకు బంగారు తెలంగాణను ముడివేసి మాట్లాడారు. తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే గడ్డి మేతకు అన్నట్లు రాష్ట్ర అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. ఆ అభివృద్ధి మాత్రానికి కొనసాగింపే బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ నినాదామని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే, తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో తమదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. బీజేపీ చెపుతున్న డబుల్ ఇంజిన్, డబుల్ ఇంజన్ కాదు.. అది ట్రబుల్ ఇంజన్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను అసెంబ్లీలో ప్రస్తావించారు కేటీఆర్. ఉత్తరప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక వృద్ధి దేశంలో చివరి స్థానంలో ఉందని అన్నారు. సింగల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ మొదటి వరుసలో ఉందని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ స్టాటజీ తెలంగాణలో పనిచేయవు అని అసెంబ్లీ వేదిగా స్పష్టం చేశారు. అయితే, తెలంగాణలో డబుల్ ఇంజిన్’ నినాదం తెలంగాణలో పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పటికీ సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న తెరాసకు డబుల్ ట్రబుల్ ఏంటో కొంత తప్పదని, పరిశీలకు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-double-engine-formula-in-telangana-39-133114.html





