బీజేపీ, కాంగ్రెస్.. బలోపేతం అయ్యాయా? బలహీనపడ్డాయా?
Publish Date:Mar 18, 2024
Advertisement
ఇండియా కూటమి బలహీనపడుతూ కాంగ్రెస్ బలోపేతమౌతోందా? ఎన్డీయే బలోపేతం చేస్తామనడం వెనుక బీజేపీ బలహీనపడిందన్న సంకేతాలు ఉన్నాయా? ప్రస్తుతం రాజకీయ సర్కిల్స్ లో ఇదే చర్చ విస్తృతంగా సాగుతోంది. ముందుగా బీజేపీ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకూ ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలను ఒక్కటొక్కటిగా వదుల్చుకున్న కమలం పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున భాగస్వామ్యపక్షాలను చేర్చుకునేందుకు తహతహలాడుతోంది. ఇందుకు కారణం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నాలుగోందలకు పైచిలుకు స్థానాలలో విజయమే లక్ష్యమని చెబుతున్నది. అందు కోసం ఎన్డీయే కూటమి బలోపేతం పేరిట నిన్న మొన్నటి దాకా కారాలూ, మిరియాలూ నూరిన పార్టీలను సైతం కూటమిలోకి రావాల్సిందిగా ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపించేస్తొంది. పొత్తు కోసం ఒక అడుగు వెనక్కు తగ్గడానికి సైతం సిద్ధ పడిపోతోంది. రామ మందిర నిర్మాణం, ట్రిబుల్ తలాక్, సీఏఏ వంటి బీజేపీ సర్కార్ నిర్ణయాలు కమలం పార్టీకి అనుకున్నంత మైలేజ్ ఇవ్వలేదా అన్న అనుమానాలు కూడా పొడసూపుతున్నాయి. అభివృద్ధి, ప్రపంచ దేశాలలో గుర్తింపు, ఆర్థిక ప్రగతి అన్ని వర్గాలకూ న్యాయం వంటి నినాదాలు, ఆర్భాటంగా ప్రచారాలు ఇవేవీ బీజేపీని గతం కన్నా బలోపేతం చేయాలేదా అన్న అనుమానాలకు ఎన్డీయే బలో పేతం కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు తావిస్తున్నాయి. పరిశీలకులు అయితే వాజ్ పేయి హయాంలో భారత్ వెలిగిపోతున్నది అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకుని మరీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడిన సంగతిని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా బీజేపీది ఆర్భాట ప్రచార పటాటోపమేనా, క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యల పరిష్కారంలో ఆ పార్టీ వైఫల్యం రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయంపై కమలనాథుల్లో అనుమాలు ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక బీజేపీ యేతర పార్టీలు కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చి ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి తొలి అడుగులోనే తడబడింది. బీజేపీయేతర పార్టీల ఐక్యతకు పౌరోహిత్యం వహించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజకీయ లభనష్టాలను బేరీజు వేసుకుని ముందుగానే గోడ దూకేశారు. ఆయన ఎన్డీయే కూటమిలో చేరి తన పదవిని కాపాడుకుని, తన స్థాయి, పరిధి బీహార్ కే పరిమితమని చాటుకున్నారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పక్షం జారిపోవడం మొదలైంది. పూర్తిగా రూపుదిద్దుకోకుండానే ఇండియా కూటమి ఇప్పుడు ఉందా? లేదా అన్న అనుమానాలు సామాన్యులలో సైతం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకుని, ఇండియా కూటమి నుంచి వైదొలగి, సొంతగా పోటీ చేయడానికి లేదా బీజేపీకి మద్దతునివ్వడానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే తెగతెంపులు చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ లోని మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరి పోటీకి రెడీ అయిపోయింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన తమ మిత్రపక్షాలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ః పార్టీ (శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీలను సంప్రదించకుండానే ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేసి తన ఉద్దేశమేమిటన్నది స్పష్టం చేసింది.జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి రెండు ప్రధాన స్తంభాలుగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కేరళలో పరస్పరం ఢీ కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మామూలుగా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 2019 ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమౌతాయని అందరూ భావిస్తారు. అయితే దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ రోజు రోజుకూ బలపడుతుండటం, అదే సమయంలో బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎన్డీయే కూటమిలోకి సాధ్యమైనన్ని పార్టీలను చేర్చుకోవడానికి తహతహలాడటం చూస్తుంటే.. బీజేపీ బలహీనపడిందా, లేక కాంగ్రెస్ బలోపేతమైందన్న ఆందోళనలో ఉందా అన్న చర్చ విస్తృతంగా జరిగింది. ఈ సందర్బంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పట్లో కాంగ్రెస్ బలంగా పుంజుకుంటోంది జాగ్రత్త వహించాలనంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ తప్పదని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-congress-strengthened-or-weakened-39-172281.html





