పీకే ఇంటిపైకి బుల్డోజర్
Publish Date:Feb 13, 2021
Advertisement
రాజకీయాలు గాడి తప్పుతున్నాయి. ప్రతీకారాలకు అధికారం అస్త్రంగా మారుతోంది. ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన పాలకులు... దాన్ని పక్కన పెట్టి తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. దూకుడు నిర్ణయాలతో రాజకీయాలకు మచ్చ తెస్తున్నారు. గతంలో తమిళనాడు ఎక్కువగా కనిపించిన ఈ తరహా రాజకీయాలు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పీక్ స్టేజీకి చేరాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో ప్రభావితం అయ్యారో ఏమో.. బీహార్ లోనూ అదే జరుగుతోంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్ మాజీ నేత ప్రశాంత్ కిశోర్ ఇంటి సరిహద్దు గోడలను బీహార్‌లోని బక్సర్ పాలనా యంత్రాంగం కూల్చివేసింది. ప్రహారి గోడతో పాటు అతని ఇంటిలోని కొంత భాగాన్ని కూడా నేలమట్టం చేసింది. ప్రశాంత్ కిశోర్ ఇంటిలోని కొంత స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు బక్సర్ అధికారులు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 84వ జాతీయ రహదారిని ఫోర్‌లైన్స్‌గా మార్చేందుకు భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇంటిలోని కొంత భాగాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ ఇంటి గోడలను కూల్చివేస్తున్న సమయంలో జనం అక్కడ భారీఎత్తున గుమిగూడారు. 15 నిముషాల్లో ఈ కూల్చివేతల కార్యక్రమం పూర్తయ్యింది. తన ఇంటిలోని కొంత బాగాన్ని బుల్డోజర్ తో కూల్చడంపై ప్రశాంత్ కిశోర్ ఇప్పటివరకూ ఏమీ మాట్లాడలేదు. బీహార్ అసెంబ్లీకి గత నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ-జేడీయూ కూటమి అత్తెసరు మెజార్టీతోనే విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఆర్జేడీకి వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. ఆయన డైరెక్షన్ లోనే తేజస్వి యాదవ్ దూసుకుపోయారు. బీజేపీ-జేడీయూ కూటమికి చుక్కలు చూపించారు. ప్రచారంలో బీజేపీ-నితీశ్ కూటమిపై ఘాటుగా విమర్శలు చేశారు పీకే. ఆ కోపంతోనే ఇప్పుడు ఆయన ఇంటిని కూల్చేశారని భావిస్తున్నారు .
http://www.teluguone.com/news/content/bihar-govt-collapse-prashanth-kishore-house-39-110044.html





