రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. ఆ డబ్బు చెల్లించకుంటే జైలుకే!
Publish Date:Dec 21, 2024
Advertisement
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీఇన్నీకావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల అవినీతి భాగోతాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును జగన్ మోహన్ రెడ్డి అప్పనంగా తన అనుచర గణానికి, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టిన వారికి జీతాల రూపంలో ఇచ్చేశారు. ఏపీ విజిలెన్స్ విభాగం ఫైబర్ నెట్, డిజిటల్ కార్పొరేషన్, స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్లలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ డబ్బు తీసుకొని వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీశారన్న విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ఇచ్చిన డబ్బు ఎవరో నిర్మాతలు ఇచ్చింది కాదు, ప్రభుత్వం సొమ్మేనని తేటతెల్లమైంది. అంతే కాదు.. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా, ఫైబర్ నెట్ ద్వారా, స్కిల్ డవలప్ మెంట్ ద్వారా వైసీపీ కుటుంబ సభ్యులకు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు భారీ మొత్తంలో జీతాలు చెల్లించేశారు. వీరంతా సోషల్ మీడియా ద్వారా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, జగన్‌తో రాజకీయంగా విభేదించిన ఆయన చెల్లిని, తల్లిని విమర్శించడంతోపాటు, అసభ్య పదజాలంతో దూసించేవారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో రాంగోపాల్ వర్మ వ్యూహం, శపథం అనే రెండు సినిమాలను తీశారు. రాంగోపాల్ వర్మ ఈ సినిమాలు తీసే సమయంలోనే.. ఈ సినిమాలు తీసేది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను విమర్శించడానికి.. వైఎస్ఆర్, వైఎస్ జగన్ రెడ్డిని పొగడటానికి అని బొమ్మల ద్వారా తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ మేలు చేసేలా తీసిన వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ నెట్‌లో విడుదల చేశారు. ఇందుకుగాను పైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా రూ.2.10కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాంగోపాల్ వర్మకు సంబంధించిన ఒక సంస్థకు సుమారు 1.10 కోట్లు చెల్లించినట్లు ఏపీ విజిలెన్స్ విభాగం విచారణలో వెలుగులోకి వచ్చింది. మరో రూ.90లక్షలు పెండింగ్‌లో ఉండగా.. పెండింగ్ సొమ్ము చెల్లించవద్దని ఫైబర్ నెట్ కొత్త కార్యవర్గానికి విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేసింది. అదేవిధంగా మమ్ముట్టి కథానాయకుడిగా తీసిన యాత్ర-2 సినిమాకు కూడా రూ.2.10 కోట్లు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు ఎండీగా వాసుదేవ రెడ్డి ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ప్రభుత్వ సొమ్ముతో జీతాలు చెల్లించారని తెలుస్తోంది. వీరంతా సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నేతలు, వారి కటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో, మార్పింగ్ పొటోలతో పోస్టులు చేసేవారు. వీరిలో కొందరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.
తాజాగా సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్ల రూపాయలు అనుచితంగా లబ్ది పొందారని పేర్కొంటూ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు పంపింది ఏపీ సర్కార్. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కట్టాలని ఆదేశించారు. ఈ విషయంపై జీవీ రెడ్డి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన 'వ్యూహం' సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించిందని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని, ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11000 చొప్పున చెల్లించినట్లు అయ్యిందని, దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది అని చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు.
పదిహేను రోజుల్లోపు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజాధనానికి సంబంధించిన మ్యాటర్ కావడంతో ముందుగా డబ్బుల రికవరీకి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీకి ఈ మొత్తమే వచ్చాయా..ఇతర మార్గాల్లో ఏమైనా ప్రభుత్వం చెల్లించిందా అన్నది బయటకు రావాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/big-shock-to-rgv-25-190168.html