భోగాపురం ఎయిర్ పోర్టు.. వైసీపీ విమర్శలను పట్టించుకోని విశాఖ జనం.!
Publish Date:Aug 3, 2026
Advertisement
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమైన తరుణంలో.. విశాఖపట్నానికి భోగాపురం విమానాశ్రయం చాలా దూరంలో ఉందంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను విశాఖ జనమే ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. అసలు భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది. అసలు భోగాపురం ప్రాధాన్యత, పౌర సేవలు ఇక్కడికి మార్చడం వెనుక ఉన్న వ్యూహాలు, క్షేత్రస్థాయి సానుకూలతల విషయానికి వస్తే.. విశాఖ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతికూల అంశంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా వైసీపీ విమర్శలను పరిశీలకులు తోసిపుచ్చుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి సందేహాలూ, విమర్శలూ వ్యక్తమయ్యాయి. అప్పట్లో నగర నడిబొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయాన్ని మూసివేసి.. నగరం బయట ఉన్న శంషాబాద్‌కు విమాన సేవలను తరలిస్తున్న సమయంలో ప్రజల నుంచి దూరం, ప్రయాణ సమయం, చివరి మైలు కనెక్టివిటీపై వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే.. ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ, అలాగే ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా, శరవేగంగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ అవసరాలను ఎంతో సమర్థవంతంగా తీరుస్తోంది. ఇప్పుడు ఎవరి నోటీ దూరం మాట వినిపించడం లేదు. అదే తరహాలో భోగాపురం కూడా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చివేస్తుందని పరిశీలకులు చెప్పడం కాదు.. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక విమానాశ్రయాలను నగరాలకు దూరంగా నిర్మించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎయిర్‌పోర్ట్‌లు నగర నడిబొడ్డున లేవు. నగరాల పరిధిలో భూముల ధరలు అత్యంత భారీగా ఉండటం.. విస్తరణకు కావలసిన భూమి లభించకపోవడం ఒక కారణమైతే.. నగరం నడిబొడ్డున విమానాశ్రయం ఉంటే.. ఎయిర్ పోర్టుకు వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తి జనం ఇబ్బందులకు ఎదుర్కోవలసి ఉంటుంది. బేగంపేటలో పౌర విమాన సేవలు కొనసాగిన సమయంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యేదన్న సంగతి విదితమే. వేగంగా విస్తరిస్తున్న విశాఖ వంటి పారిశ్రామిక నగరంలో, నగర పరిధిలోనే అంతర్జాతీయ స్థాయి రన్వేలు, టెర్మినళ్లు, కార్గో కాంప్లెక్స్‌లను విస్తరించడం దాదాపు సాధ్యం కాదు. ఈ విషయాన్ని నిపుణులే చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి)లో జీఎమ్ఆర్ భారీ పెట్టుబడులతో నిర్మించింది. దీని నిర్వహణ కూడా జీఎంఆర్ సంస్థే చేపట్టింది. ఇంతటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీపంలో మరో పోటీ విమానాశ్రయం ఉంటే ఇబ్బంది. అందుకే హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన వెంటనే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమాన సర్వీసులకు మూసివేశారు. ఇప్పుుడు కూడా అలాగే.. విశాఖలోని పాత విమానాశ్రయం నుంచి పౌర సేవలకు క్రమంగా స్వస్తి చెప్పి.. ఆ విమానాశ్రయాన్ని ఇండియన్ నేవీ ఆపరేషన్లకు అప్పగిస్తారు. ఇకపై షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలన్నీ భోగాపురం నుంచే రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నంవాసులు ఈ దూర భారాన్నీ, భయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడానికి మరో కారణమేంటంటే.. విమాన ప్రయాణం అనేది ఆర్టీసీ బస్సు స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ మాదిరిగా ప్రతిరోజూ సాధారణ ప్రజలు ఉపయోగించేది కాదు. విశాఖపట్నం మొత్తం జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు నిత్యం విమానాశ్రయాన్ని సందర్శించరు. కేవలం కొద్ది శాతంగా ఉండే వ్యాపారులు, పర్యాటకులు, ఐటీ నిపుణులు, అత్యవసర ప్రయాణికులు మాత్రమే తరచూ విమానాలను ఆశ్రయిస్తారు. పైగా.. ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయం నేవీ ఆధీనంలో ఉండటంతో పాటు, చుట్టూ కొండలు, విస్తరించిన జనావాసాలు ఉండటంతో రాత్రివేళల్లో ల్యాండింగ్‌లు, పెద్ద బోయింగ్ విమానాల రాకపోకలకు పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా నేరుగా కనెక్టివిటీ సాధించాలంటే భోగాపురం వంటి ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఒక్కటే శరణ్యం. అలాగే.. విశాఖపట్నం భౌగోళికంగా ఉత్తరం వైపున భోగాపురం, ఆనందపురం, భీమిలి దిశగా వేగంగా విస్తరిస్తోంది. రాబోయే పది, పదిహేనేళ్లలో విశాఖ మహానగరం భోగాపురం వరకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్లు, ఐటీ పార్కులు, ఏరోసిటీ, విద్యా, వైద్య సంస్థలు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతుండటంతో ఆ ప్రాంతమంతా కొత్త ఆర్థిక హబ్‌గా మారబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల కేవలం విశాఖపట్నానికే కాకుండా సమీపంలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు కూడా విమాన ప్రయాణం సులభతరం అవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతీయ అసమానతలను తొలగించి, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలలో గుణాత్మక మార్పులు తీసుకురానుంది. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు దూరభారం లేదా సమయభారం అనిపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్ హెచ్ఏఐ పలు రహదారి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ప్రస్తుత జాతీయ రహదారి 16 విస్తరణ, విస్తృతమైన సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటు, విశాఖ పోర్ట్ నుంచి నేరుగా భోగాపురం వరకు 6 వరుసల బీచ్ కారిడార్ కోస్టల్ హైవే నిర్మాణంలో ఉంది. సవరవిల్లి వద్ద నిర్మిస్తున్న ప్రత్యేక ట్రంపెట్ ఇంటర్చేంజ్, అనకాపల్లి, ఆనందపురం బైపాస్ రహదారులు సిటీ ట్రాఫిక్ చిక్కులు లేకుండా నేరుగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ చేరుకునేందుకే దోహదపడతాయి. ఈ రహదారులన్నీ పూర్తయితే విశాఖ నగర కేంద్రం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 35 నుంచి 40 నిమిషాల్లో సునాయాసంగా చేరుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించే సమగ్ర ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనికి తోడు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సులు, విద్యుత్ ఆధారిత ఫీడర్ బస్సు సేవలు నిరంతరం అందుబాటులో ఉంటే నగరవాసులకు కనెక్టివిటీ పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. Bhogapuram International Airport, Visakhapatnam Airport Connectivity, (Bhogapuram Expressway Beach Corridor, Vizag Metro Rail Project, North Andhra Infrastructure Development
http://www.teluguone.com/news/content/bhogapuram-international-airport-25-227848.html





