ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ .. ప్రధాన ఆకర్షణలు ఇవే..!
Publish Date:Aug 1, 2026
Advertisement
ఉత్తరాంధ్ర రూపురేఖలను సమూలంగా మార్చేసే దిశగా రూపుదిద్దుకున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్‌పోర్ట్ ప్రాంతీయ ప్రగతికి సరికొత్త బాటలు వేయనుంది. ఈ విమానాశ్రయంలో ప్రతిష్టాత్మకంగా రెండు రన్‌వేలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో రన్‌వే 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో నిర్మితమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారీ ఆకృతి కలిగిన ఎయిర్‌బస్, బోయింగ్ వంటి అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడ సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు పాటించారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఒకే సమయంలో ఏకంగా 45 విమానాలను పార్కింగ్ చేసేలా విశాలమైన ఏప్రాన్ సౌకర్యాన్ని కల్పించారు. దీనివల్ల పీక్ అవర్లలోనూ విమానాల రాకపోకలకు ఎలాంటి అవరోధం కలగకుండా, గ్రౌండ్ ఆపరేషన్లు సాఫీగా సాగడానికి వీలు కలుగుతుంది. టెర్మినల్ భవనాన్ని 79 వేల చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో అత్యంత ఆకర్షణీయమైన ‘ఎగిరే చేప’ (ఫలైయింగ్ ఫిష్) ఆకారంలో తీర్చిదిద్దడం విశేషం. ప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు గాను 40 చెక్-ఇన్ కౌంటర్లు, 10 ఇమిగ్రేషన్ కౌంటర్లను అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో ప్రయాణికులు వేగంగా లగేజ్ పొందేందుకు 5 డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ బ్యాగేజీ బెల్టులను అమర్చారు. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించేలా అధునాతన లాంజ్‌లు, వివిధ రకాల బ్రాండెడ్ డ్యూటీ ఫ్రీ షాపులు, కఫేలను ఇక్కడ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర విమానయాన రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. విశాఖపట్నానికి 45 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటైన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనుంది. విమానయాన వసతులతో పాటు పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ, విదేశాలతో అనుసంధానం మరింత బలోపేతం కానుంది. శనివారం ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయంలో రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. జీఎంఆర్ సంస్థ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో సరుకు రవాణాతో పాటు పర్యాటక రంగం వేగంగా పుంజుకుంటుందని స్థానిక వ్యాపారవేత్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగర కేంద్రం నుంచి విమానాశ్రయానికి ప్రయాణికులు వేగంగా చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక ఎలివేటెడ్ కారిడార్లు, రహదారుల విస్తరణ పనులను కూడా వేగవంతం చేశారు. తీర ప్రాంత రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో ఐటీ, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు ఈ కేంద్రం కీలకంగా మారనుంది. తొలి దశలోనే ఏటా లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యంతో రూపుదిద్దుకున్న భోగాపురం విమానాశ్రయం, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రను అంతర్జాతీయ పటంలో ఒక ప్రధాన ఆర్థిక, పర్యాటక హబ్‌గా నిలబెడుతుందని భావిస్తున్నారు. Bhogapuram Airport Inauguration, Alluri Sitarama Raju International Airport, AP Development Projects, Visakhapatnam Semiconductor Plant, PM Modi AP Visit Schedule, CM Chandrababau, GMR
http://www.teluguone.com/news/content/bhogapuram-airport-inauguration-36-227701.html





