భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి జగనే కారణం : పెమ్మసాని
Publish Date:Aug 2, 2026
Advertisement
వైసీపీ నాయకుల వైఖరి, గత ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తీవ్రంగా ఆలస్యమైందని కేంద్ర విమానయాన, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో భోగాపురం వద్ద 2,700 ఎకరాల విస్తీర్ణంలో భారీ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదిరిందని పెమ్మసాని గుర్తుచేశారు. 2019 నాటికే తెలుగుదేశం ప్రభుత్వం రూ.2,200 ఎకరాల భూసేకరణను విజయవంతంగా పూర్తి చేసిందని వివరించారు. మిగిలిన 500 ఎకరాల సేకరణను అడ్డుకునేందుకు వైకాపా నేతలు కోర్టుల్లో వరుస కేసులు వేశారని ఆయన ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం స్వయంగా కొన్ని కేసులను ఉపసంహరించుకున్నప్పటికీ, ఐదేళ్ల కాలంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించగలిగిందని పెమ్మసాని విమర్శించారు. భోగాపురం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ వైకాపా ప్రభుత్వం రీ-టెండర్లకు వెళ్లిందని, ఈ అనవసర నిర్ణయాల వల్లే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం సంవత్సరాల తరబడి వెనుకబడిందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో నిర్మించి ప్రాజెక్టును సాకారం చేసింది తమ ప్రభుత్వమైతే, వైకాపా నాయకులు క్రెడిట్ కొట్టేయాలని చూడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మరోవైపు, దేశంలోని పొగాకు రైతులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్క పొగాకు రైతుకు రూ.50 వేల వరకు ఎలాంటి వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వడ్డీలేని రుణ సదుపాయం ద్వారా సుమారు 40 వేల మంది పొగాకు రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుంటే, పొగాకు అంశాన్ని సైతం వైకాపా నాయకులు రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వేగవంతంగా పూర్తవుతున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని, రానున్న రోజుల్లో ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత వేగవంతం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Bhogapuram Airport, Pemmasani Chandrasekhar, CM Chandrababu, Jagan Mohan Reddy, tobacco farmers interest-free loan
http://www.teluguone.com/news/content/bhogapuram-airport-36-227801.html





