అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ..!
Publish Date:Aug 1, 2026
Advertisement
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ఆత్మీయంగా, అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. టెర్మినల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ టెర్మినల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలు, ప్రయాణికుల కోసం సిద్ధం చేసిన అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. విమానాశ్రయ నిర్మాణ సంస్థ జీఎమ్మార్ (GMR) ప్రతినిధులు ఎయిర్పోర్ట్ రూపకల్పన, విశాలమైన చెక్-ఇన్ హాళ్లు, రన్‌వే ప్రత్యేకతలు మరియు ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ నమూనాలను ప్రధానికి సమగ్రంగా వివరించారు. భవిష్యత్తులో ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రణాళికలను కూడా ప్రధాని ఆసక్తిగా ఆరా తీశారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర హర్షం వ్యక్తం చేసింది. ఉత్తరాంధ్రలో పర్యాటక రంగం, ఐటీ, పారిశ్రామిక ప్రాజెక్టుల విస్తరణకు ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సరికొత్త చోదక శక్తిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖపట్నం సహా పరిసర జిల్లాల ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు ఈ ప్రారంభోత్సవంతో తెరపడింది. స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ఎయిర్పోర్ట్ కీలక భూమిక పోషిస్తుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో భాగంగా టెర్మినల్ భవనాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లను ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్‌ను ప్రధాని మోదీ తిలకించారు. వీడియో వాల్‌పై ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఉత్తరాంధ్ర ప్రాంత చారిత్రక విశేషాలు, సాంస్కృతిక అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించారు. అనంతరం విమానాశ్రయ నమూనాను జీఎంఆర్ ప్రతినిధులు ప్రధాని మోదీకి వివరించారు. విమానాశ్రయంలోని నిర్మాణ ప్రత్యేకతలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, టెర్మినల్ భవనం రూపకల్పన తదితర అంశాలను ప్రధానికి వివరించారు. టెర్మినల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కళాకృతులను కూడా ప్రధాని మోదీ ఆసక్తిగా పరిశీలించారు.ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న సమయంలో విమానాశ్రయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళల థింసా నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. సుమారు 13,500 మంది గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తుల్లో థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ఓపెన్‌టాప్ జీపులో వెళ్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ నృత్య ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ భారీ థింసా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం నేతలు ఓపెన్‌టాప్ జీపులోనే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. Bhogapuram Airport, Prime Minister Narendra Modi, CM Chandrababu, Deputy CM Pawan Kalyan, Alluri Sitarama Raju International Airport, AP Development Projects, Visakhapatnam Semiconductor Plant, GMR, Alluri Sitarama Raju International Airport
http://www.teluguone.com/news/content/bhogapuram-airport-36-227731.html





