పీఎస్‌లోనే ఫైటింగ్: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.!
Publish Date:Sep 25, 2026
Advertisement
ఒక వివాహేతర సంబంధం ఇద్దరి జీవితాల్లో మొదలైన వివాదాన్ని.. ఏకంగా ఇరువర్గాల మధ్య గొడవగా మార్చింది. మాటలతో మొదలైన పంచాయితీ కాస్తా చేతుల మీదుగా మారింది. చివరకు గొడవను పరిష్కరించుకోవాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది.కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం విషయంలో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇరువర్గాలకు చెందిన వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే స్టేషన్ ముందు నుంచే ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాటామాటా పెరిగింది.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగిన ఇరువర్గాలు ఒక్కసారిగా పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో గొడవ పడుతున్న వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఏకంగా పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లారు.స్టేషన్‌లోకి వచ్చిన తర్వాత కూడా గొడవ ఆగలేదు. పోలీసుల ముందే ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. అదే సమయంలో గణేష్ నిమజ్జనం బందోబస్తు కారణంగా త్రీటౌన్ పోలీస్ సిబ్బందిలో ఎక్కువ మంది విధుల్లో బయట ఉన్నారు. స్టేషన్‌లో సిబ్బంది తక్కువగా ఉన్న సమయంలోనే పదుల సంఖ్యలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పే పరిస్థితి ఏర్పడింది. అయితే నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇరువర్గాలను వేరు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణకు పాల్పడిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒక వ్యక్తిగత వ్యవహారంగా మొదలైన వివాదం.. కుటుంబాలు, బంధువులు, ఇరువర్గాల మధ్య పంచాయితీగా మారి.. చివరకు పోలీస్ స్టేషన్‌లోనే ఫైటింగ్‌కు దారితీయడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. [ Bhadradri Kothagudem, Kothagudem, Extramarital Affair, Police Station Fight, Police Station Clash, Three Town Police, Family Dispute,Two Groups Clash, Ganesh Immersion, Telangana Crime, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/bhadradri-kothagudem-24-232473.html





