బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు: స్టార్టప్ ఫౌండర్ వైరల్ పోస్ట్!
Publish Date:Aug 21, 2026
Advertisement
భారతదేశ ఐటీ రాజధానిగా ఎంతో పేరుగాంచిన బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ మరీ దారుణంగా తయారవుతున్నాయి. అక్కడ కొత్తగా మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చినా, అనేక ఫ్లైఓవర్లు నిర్మించినా కూడా రోడ్లపై వాహనాల రద్దీ మత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఈ ఘోరమైన ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ నగరంలో ప్రతిరోజూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న నరకప్రాయమైన ప్రయాణ కష్టాలపై అప్లైడ్ ఏఐ స్టూడియో ఫౌండర్ బాల పన్నీర్ సెల్వం చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన తన కంపెనీ ఆఫీసులో ఉద్యోగులు లేక ఖాళీగా ఉన్న డెస్క్‌ల ఫొటోను షేర్ చేస్తూ రాసుకొచ్చిన విషయాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. తన లింక్డ్‌ఇన్ ఖాతాలో బాల పన్నీర్ సెల్వం షేర్ చేసిన పోస్ట్‌లో ఆసక్తికరమైన అలాగే నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు చేశారు. "మా ఆఫీసులో సమస్య ఉద్యోగుల పనితీరులో లేదా వారి వైఖరిలో లేదు, వారు సమయానికి ఆఫీసుకు చేరుకోవడంలోనే అసలైన సమస్య ఉంది" అని ఆయన ఎంతో స్పష్టంగా పేర్కొన్నారు. సిటీలో ప్రతిరోజూ చిన్న చిన్న దూరాలు చేరుకోవడానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఒక స్కూటీపై కేవలం 4 కిలోమీటర్ల దూరం వెళ్లడానికే దాదాపు 20 నిమిషాల సమయం పడుతోందని తెలిపారు. ఒకవేళ టూవీలర్ కాకుండా కారులో గనుక బయలుదేరితే ఈ సమయం మరింత పెరిగిపోతుందని వివరించారు. పీక్ అవర్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకుంటూ ప్రయాణించడమే ఒక పెద్ద యుద్ధంలా మారుతోందని ఆయన ఆందోళన చెందారు. ఇలా ప్రతిరోజూ ఉదయమే రోడ్లపై నరకం చూసి ఆఫీసుకు చేరుకునేసరికి ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోతున్నారని చెప్పారు. అలా అలసిపోయిన మానసిక స్థితితో ఆఫీస్‌కు వచ్చి ఉద్యోగులు ఇక ఏం పని చేయగలరని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు లేని సాధారణ రోజున సాయంత్రం 4 గంటల సమయంలో వైట్‌ఫీల్డ్ నుంచి హెచ్‌ఎస్‌ఆర్ వరకు ఉన్న 17 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి తనకు ఏకంగా 2 గంటల సమయం పట్టిందని తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. సాయంత్రం 4 గంటలకే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీసుల నుంచి ఇళ్లకు బయల్దేరితే ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతమని పేర్కొన్నారు. bengaluru it employees traffic issues viral news,applied ai studio founder bengaluru traffic post.
http://www.teluguone.com/news/content/bengaluru-traffic-problem-startup-founder-viral-post-36-229422.html





