కేసీఆర్ కోన్ కిస్కా.. బండి సంచలన వ్యాఖ్యలు
Publish Date:Jul 4, 2022
.webp)
Advertisement
తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. మోడీ ప్రసంగించిన ఆ సభకు జనసమీకరణలో రాష్ట్ర బీజేపీ విజయవంతమైంది. ప్రధాని మోడీ కూడా సభకు హాజరైన జనసందోహాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. సభా నిర్వహణ భేష్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి మరీ అభినందించారు. అదీ సభా వేదికపైనే. ఇది బండికి అనుకోని కానుక. అగ్రనేత, అందునా ప్రధాని మోడీ నుంచి భుజం తట్టి అభినందన అందుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. సరే అదంతా అయిపోయింది. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం వద్ద మోడీకి వీడ్కోలు పలికిన తరువాత బండి తనను తాను మరచిపోయి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. కోన్ కిస్కా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభ విజయవంతమైన ఆనందం ఆయనలో పట్టలేనంతగా ఉండొచ్చు తప్పు లేదు. ఆ ఆనందాన్ని పార్టీ సహచరులతో పంచుకోవచ్చు. మరింత ఉత్సాహంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయవచ్చు. కానీ బండి ఆ ఆప్షన్లు ఎంచుకోలేదు. ముఖ్యమంత్రిపై పరుష వ్యాఖ్యలతో రెచ్చి పోయారు. సీఎం కేసీఆర్ ఎవరు కోన్ కిస్కా.. ప్రధాని మోడీ ఆయనకు సమాధానం చెప్పడమేమిటి, మోడీ చెప్పాల్సిందేదో తెలంగాణ ప్రజానీకానికే చెప్పారంటూ వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగం తరువాత కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఇంత కాలం ఊదరగొట్టిన కేసీఆరే తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా ఇంత కాలం కేంద్రం నిధులతో షోకు చేసిన కేసీఆర్ బండారం మోడీ ప్రసంగంతో బట్టబయలైందని విమర్శించారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎంత ఘాటుగానైనా ఉండొచ్చు కానీ బాధ్యతాయుతమైన నేత ఎవరూ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయరు. ఇష్టారీతిన చేసే వ్యాఖ్యల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కోన్ కిస్కా అని బండి చులకన చేయడం పట్ల బీజేపీ శ్రేణుల్లోనే అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/bandi-sensational-comments-on-kcr-25-139028.html












