Chennai: దేశ రక్షణలో బీఎస్ఎఫ్ కీలక పాత్ర: బండి సంజయ్
Publish Date:Sep 25, 2026
Advertisement
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.! దేశ రక్షణలో బీఎస్ఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలైట్లు, దేశ వ్యతిరేక శక్తులపై పోరాటంలో బీఎస్ఎఫ్ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. చెన్నైలోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్తగా నిర్మించిన పలు భవనాలను బండి సంజయ్ ప్రారంభించారు. రూ.11.07 కోట్లతో నిర్మించిన పరిపాలనా భవనం, రూ.4.74 కోట్లతో నిర్మించిన గెజిటెడ్ అధికారుల భవనం, రూ.9.86 కోట్లతో నిర్మించిన సిబ్బంది బ్యారక్, రూ.5.30 కోట్లతో నిర్మించిన సబార్డినేట్ అధికారుల భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బీఎస్ఎఫ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 2014లో చెన్నై–మల్కాన్‌గిరి సెక్టర్ ఏర్పడినప్పటి నుంచి బీఎస్ఎఫ్ సిబ్బంది నక్సలైట్లు, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జవాన్లు చూపిస్తున్న ధైర్యం, అప్రమత్తత, అంకితభావం అభినందనీయమన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు రక్షణ గోడలా నిలిచి దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు. వారి సేవల వల్ల మల్కాన్‌గిరి ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి పరిస్థితులు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు.దేశ సరిహద్దులను కాపాడే జవాన్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని బండి సంజయ్ తెలిపారు. జవాన్లు ఎలాంటి వాతావరణంలోనైనా విధులు నిర్వహి స్తున్నారని, వారికి మెరుగైన వసతి, విశ్రాంతి, పరిశుభ్రత, ఇతర మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. చెన్నైలో ప్రారంభించిన కొత్త భవనాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని, దేశం కోసం పనిచేస్తున్న జవాన్ల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇవి నిదర్శనమని అన్నారు. విధులు ముగించుకున్న తర్వాత జవాన్లు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని, మరింత ఉత్సాహంతో విధుల్లో పాల్గొనేలా మంచి వాతావరణం కల్పించడమే లక్ష్యమని వివరించారు. దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది, వారి కుటుంబాలకు చెన్నై సెక్టర్ ద్వారా వైద్య, విద్య, సంక్షేమ, పరిపాలనా సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని బండి సంజయ్ తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. [ Bandi Sanjay inaugurates new BSF buildings in Chennai, BSF Sector Headquarters, PM MODI, Union Home Minister Amit Shah, Chennai, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/bandi-sanjay-inaugurates-new-bsf-buildings-in-chennai-25-232530.html





