బాలినేని 'రాజీ'నామా?.. జగన్‌కు బిగ్ షాక్!?
Publish Date:Apr 10, 2022
Advertisement
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మరొకసారి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు. సీఎం జగన్‌రెడ్డి తన బంధువే కావడంతో తనకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారని అనుకున్నారు. చివరిదాకా పట్టుబట్టారు. బంధువు బంధువే.. కేబినెట్ కేబినెటే అంటూ జగనన్న బాలినేనిని పక్కన పట్టేశారు. ఆయనకు మంత్రి పదవి దక్కకుండా మరో బంధువు వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పారని అంటున్నారు. అయితే, అదే జిల్లాకు చెందిన సురేశ్‌ను మరోసారి కేబినెట్‌లోకి తీసుకోవడంతో బాలినేని ఇగో హర్ట్ అయింది. ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. జిల్లాలో పరువంతా పోయింది. దీంతో.. సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. 24 మంది మంత్రులు రాజీనామా చేస్తే.. 10 మందిని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకున్నారు. సీనియర్ అయిన తనకు మాత్రం మరో ఛాన్స్ ఇవ్వలేదని రగిలిపోతున్నారు బాలినేని. ఆయనకంటే ఆయన అనుచరులు మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఒంగోలు మేయర్‌తో సహా పలువురు కార్పొరేటర్లు రాజీనామాలకు రెడీ అయ్యారు. ఇక బాలినేని సెగతో ఒంగోలు ఉడికిపోతోంది. ఆయన అనుచరులు సీఎం జగన్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్థం చేయడం సంచలనంగా మారింది. రోడ్డుపై నిరసన తెలిపి.. సీఎం డౌన్ డౌన్.. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బాలినేని బాగా హర్ట్ అయ్యారని తెలిసి.. ఆయన్ను బుజ్జగించడానికి రంగంలోకి దిగారు జగన్ ఆంతరంగికుడు సజ్జల. స్వయంగా బాలినేని ఇంటికి వచ్చి సాయంత్రం ఓ దఫా ఓదార్చి వెళ్లారు. అయినా, ఆగ్రహం చల్లారకపోవడంతో రాత్రికి మరో రౌండ్ బుజ్జగింపుల పర్వం కొనసాగింది. సజ్జల ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా.. బాలినేని ఆయన బుట్టలో పడలేదని తెలుస్తోంది. తనకు మంత్రి పదవి రాకున్నా బాధ ఉండేది కాదుకానీ, తన జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌కు మళ్లీ ఛాన్స్ ఇచ్చి తనను లైట్ తీసుకోవడం ఏంటని.. ఇదంతా వైవీ సుబ్బారెడ్డినే చేయిస్తున్నాడంటూ సజ్జల దగ్గర తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారట బాలినేని. తన తడాఖా ఏంటో చూపిస్తానంటూ సవాల్ కూడా చేశారని అంటున్నారు. బాలినేని కోపం, ఆవేశం చూస్తుంటే.. ఆయన రాజీనామా చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే, జగన్‌ను ఎదిరించడం సాధ్యమా? పాలపొంగులా చల్లబడి రాజీ కొస్తారా?
http://www.teluguone.com/news/content/balineni-hurted-on-jagan-39-134178.html





