బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల..ఎలా ఉన్నారంటే..?
Publish Date:Jul 22, 2026
Advertisement
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురై ఎడమ మోకాలికి గాయపడ్డారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న చిత్రీకరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్రబృందం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య పరీక్షలు, ప్రత్యేక చికిత్స అవసరమని భావించిన వైద్యులు బాలకృష్ణను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆస్పత్రికి తరలిం చారు. ఏఐజీ ఆస్పత్రి బుధ వారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం, బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ రక్తం గడ్డకట్టడం (హీమటోమా), మృదు కణజాలాల్లో వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. అంతేకాకుండా మోకాలి భాగంలోని కండరాలు చిట్లి ఉండే (మసిల్ టియర్) అవకాశం కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. గాయం తీవ్రతను పూర్తిగా నిర్ధారించేందుకు ఎంఆర్ఐ సహా ఇతర ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణకు ఆర్థోపెడిక్ నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన గత వైద్య చరిత్రను కూడా పరిశీలిస్తూ, అవసరమైతే ఇతర విభాగాల నిపుణులతో సమన్వయం చేసి చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి తెలిపింది. అన్ని పరీక్షల నివేదికలు అందిన అనంతరం గాయానికి సంబంధించిన తుది నిర్ధారణ చేసి, శస్త్రచికిత్స అవసరమా లేదా మందులు, ఫిజియోథెరపీతోనే చికిత్స కొనసాగించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆయనను నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితిపై తదుపరి వివరాలను పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని ఏఐజీ ఆస్పత్రి మెడికల్ బులెటిన్‌లో పేర్కొంది. బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిన వెంటనే అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటన కారణంగా ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు సమాచారం. Balakrishna Health Bulletin released, Film shooting, AIG Hospital, Hematoma, NBK111 shooting injury, Balakrishna health update, CM Chandrababu, Naralokesh, TDP
http://www.teluguone.com/news/content/balakrishna-health-bulletin-released-36-226773.html





