రామ మందిరానికి సై అనేస్తోన్న ఓ వర్గం యూపీ ముస్లిమ్ లు!
Publish Date:Aug 8, 2017
Advertisement
అయోధ్య రామ మందిరం వ్యవహారం తేలిపోనుందా? సంకేతాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది! సుబ్రమణియన్ స్వామి లాంటి వారు చాలా సార్లు చెబుతున్నట్టుగా 2018లో బాబ్రీ వివాదం ముగిసిపోయేలా కనిపిస్తోంది! కోర్టుల్లో ఇంత కాలం ఏ కదలికా లేకుండా వున్న అయోధ్య కేసు చకచకా మలుపులు తిరుగుతోంది. త్వరలోనే రోజువారీ విచారణ కూడా మొదలు పెట్టనున్నారు సుప్రీమ్ జడ్జ్ లు! బీజేపి ఎంపీ స్వామీనే ఈ విధంగా కోర్టుని అభ్యర్థించారు. అయితే, అయోధ్య కేసులో ఇప్పుడు షియాలు కూడా కలుగజేసుకుని ఆసక్తి కలగజేస్తున్నారు… 1992లో బాబ్రీ కూల్చివేత జరిగినప్పటి నుంచీ సున్నీ పర్సనల్ లా బోర్డ్ కోర్టులో ముస్లిమ్ ల తరుఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే, తాజాగా అయోధ్య రామజన్మ స్థానం విషయంలో తమకూ హక్కు వుందని షియా పర్సనల్ లా బోర్డ్ ముందుకొచ్చింది. ఎప్పుడో 1945లోనే షియా, సున్నీలు బాబ్రీపై హక్కు కోసం కోర్టుకు వెళ్లారు. అయితే, అప్పుడు తీర్పు షియాలకి వ్యతిరేకంగా వచ్చింది. బాబ్రీపై హక్కుని సున్నీలకే అప్పగించింది స్వాతంత్ర్యానికి ముందటి కోర్టు. కాని, ఇప్పుడు దాన్ని కూడా సవాలు చేయనున్నట్టు షియా వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. బాబ్రీ నిజానికి షియా కట్టడమనీ, దానిపై తమకే హక్కు వుందని వారంటున్నారు! షియాలు, సున్నీలు బాబ్రీ విషయంలో భిన్నాభిప్రాయాలతో వుండటం కొత్తేం కాదు. అయితే, తమకూ హక్కు వుందని ఇప్పుడు వ్యాజ్యంలో ప్రవేశించిన షియాలు రామ మందిరం నిరభ్యంతరంగా కట్టుకోవచ్చనటమే ఆసక్తికలిగిస్తోంది. సున్నీ పర్సనల్ లా బోర్డ్ మాదిరిగా షియా బోర్డ్ బాబ్రీ కూల్చిన చోటనే కట్టాలని అనటం లేదు. ముస్లిమ్ లు అధికంగా వుండే మరో చోట… రామ జన్మ స్థానానికి దూరంగా వుండేలా కట్టించాలని కోరుతోంది. అదే రెండు మత వర్గాలకి సౌలభ్యంగా వుంటుందని షియాలంటున్నారు! షియా బోర్డ్ సూచించిన విధంగా కోర్టు బాబ్రీని మరో చోట నిర్మించాలని ఆదేశించవచ్చు. లేదా మరో రకమైన తీర్పు కూడా ఇవ్వవచ్చు. కాని, మొత్తం మీద కోట్లాది మంది షియాలకి ప్రాతినిధ్యం వహించే యూపీ షియా బోర్డ్ మందిర నిర్మాణానికి అభ్యంతరం లేదనటం పెద్ద పరిణామమే! దీని ప్రభావం తీర్పుపై వుంటుంది. ఎలా అన్నది మాత్రం మరి కొన్ని నెలలు సస్పెన్సే. వచ్చే సంవత్సరం దశాబ్దాల వివాదానికి, శతాబ్దాల కాలపు పంచాయితీకి తెర పడవచ్చు!
http://www.teluguone.com/news/content/ayodhya-dispute-45-76904.html





