కాంగ్రెస్ కదలి వస్తోంది తస్మాత్ ..జాగ్రత్త కేంద్రానికి గవర్నర్ నివేదిక ?
Publish Date:May 29, 2022
Advertisement
కాంగ్రెస్ పార్టీనే కదా, అని చులకనగా చూడకండి దేశ మంతా ఒకెత్తు. తెలంగాణ ఒక్కటీ ఒకెత్తు. తెలంగాణలో కాంగెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. దూసుకు పోతోంది. రాష్ట్రంలో హస్తరేఖలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది...తస్మాత్ జాగ్రత్త..’ ఇది ఏ కాంగ్రెస్ నాయకుడో, మరొకరో చేసిన హెచ్చరిక కాదు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, రాష్ట్ర గవర్నర్ కేంద్ర హోమ్ శాఖకు పంపిన తాజా నివేదికలో చేసిన ఒక కీలక సూచన. అయితే, ఇది నిజమా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిజంగా పుజుకుంటున్న మాట నిజమా .. అంటే, అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నిజానికి, రాష్ట్రంలో మొదటినుంచి కూడా తెరాసకు ప్రధాన ప్రత్యర్హ్ది కాంగ్రెస్ పార్టీనే, అయితే, ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపే, తెరాస కపట నాటకం అడుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, వరంగల్ డిక్లరేషన్’తో సీన్ మారిపోయిందని, ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రజులు, రైతులు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే గవర్నర్ కేంద్ర హోమ్ శాఖకు పంపిన నివేదికలో ... వాస్తవ పరిస్థితిని వివరించి ఉంటారని రాజకీయ పరిశీలకులు, పేర్కొంటున్నారు. మేథావుల విశ్లేషణలోనూ అదే మాట వినిపిస్తోందని అంటున్నారు. ఇక వివరాలలోకి వెళితే... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో కానీ, ఎన్నికల వేడి మాత్రం ఇప్పటికే పీక్ ‘కు చేరుకుంది. మాటలు తూటాలు పేలుతున్నాయి. వ్యూహ ప్రతి వ్యూహాలు యుద్ధం మొదలైందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. నిజానికి, ఇప్పుడు కాదు, గత ఐదారు నెలలుగా, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు నుంచే, రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇక, హుజూరాబాద్ ఫలితాలు వచ్చి నప్పటి నుంచి అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’ ఫోకస్ మొత్తం రానున్న ఎన్నికల పైనే పెట్టారు. ముఖ్యంగా, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చెప్పటిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో జోష్ ‘పెరిగింది. అంతవరకు కాంగ్రెస్ పార్టీని రాజకీయ ప్రత్యర్ధిగా గుర్తించని, ముఖ్యమంత్రి మరింత జాగ్రత్తగా పావులు కదపడం ప్రారంభించారు. ముఖాముఖీ పోటీలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం అయ్యే పని కాదని ముందుగానే భవిష్యత్’ ముఖచిత్రాన్ని ఉహించిన ఆయన వ్యూహాత్మకంగా ముక్కోణ పోటీకి అనుకూల వాతావరణం సృష్టించేందుకు అనువుగా పావులు కదుపుతూ వచ్చారు. బీజీపీని తెరమీదకు తెచ్చారు. బీజేపే బలాన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం చేశారు. కమల దళం బలాన్ని పెంచేందుకు ‘బూస్ట్’ సప్లై చేశారు. కమల నాధులతో కలిసి, కేంద్రం పై ఉత్తుత్తి యుద్ధం ప్రకటించారు. వరితో మొదలు పెట్టి పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు పంపడం వరకు అనేక విషయాలను తీసుకుని అంచెల వారీగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు చేశారు. అయితే,ఇవ్వన్నీ ఉత్తుత్తి ఆందోళనలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రళయ గర్జనలతో దూసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు, బీజేపీ, తెరాస కలిసి ఆడుతున్న నాటకమని, ప్రజలు గ్రహించడానికి అట్టే కాలం పట్టలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, “నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను ఏడ్చినట్టు చేస్తాను” అన్నట్లుగా కపట నాటకం అడుతున్నాయని ప్రజలు గ్రహించారు. అది నిజం కూడా. లేదంటే గత ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుదు నిర్ణయాలు అన్నింటికీ తలూపుతూ వచ్చిన తెరాస ఇప్పుడు ఒక్క సారిగా ఇలా, యుద్ధాన్ని ప్రకటించి, వీరంగం వేయడం ఏంటని పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తపరుస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాన టార్గెట్ కాంగ్రెస్,నిజానికి కాంగ్రెస్ ముక్త భారత్ బీజీపీ ప్రధాన రాజకీయ నినాదం. అలాగే, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీనే బీజేపీ టార్గెట్. ఇక తెరాస విషయం చెప్పనక్కరలేదు. కాంగ్రెస్, పార్టీని నిర్వీర్యం చేస్తే, ఇక తమకు అడ్డు అనేది ఉండదని తెరాస, మొదటి నుంచీ కూడా కాంగ్రెస్’ టార్గెట్ చేసింది. మూడొంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కరేక్కించుకు పోయిందే కానీ, బీజ్పీపీ ఎమ్మెల్యేలు ఒక్కరిని అయిన టచ్ చేయలేదు. ఆ రెండు పార్టీలు కూడా శత్రువు శత్రువు మిత్రుడు, అనే రాజకీయ సూక్తిని అడ్డు పెట్టుకుని కుని కాంగ్రెస్ లక్ష్యంగా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, బీజేపీ, తెరాస ఆడుతున్న దొంగాటను ముందుగానే పసి గట్టిన రేవంత్ రెడ్డి, ప్రతి వ్యూహంతో ముదుకు సాగుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, అందుకు కొనసాగింపుగా సాగిస్తున్న రైతు రచ్చబండ కార్యక్రమాలతో , కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో పట్టు పెంచుకుంటోంది.ముఖ్యంగా రుణ మాఫీ విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చేసిన ప్రకటన రైతులను ఆకట్టుకుంటోంది. అంతకాకుండా, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అన్ని విధాల విఫలమైన నేపధ్యంలో ‘ ఒక్క రైతాంగమే కాకుండా, అన్ని వర్గాల ప్రజలు కూడా, కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. అందుకే,రాష్ట్ర గవర్నర్ వాస్తవ పరిస్థితిని కేంద్రానికి నివేదించి ఉంటారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అదే సమయంలో గవర్నర్ నివేదికపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తాయి అనేది చూడవలసి ఉంటుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/aware-congress-is-strengthening-governer-report-to-center-25-136612.html





