పాకిస్థాన్ పై బలూచ్ తిరుగుబాటు దారుల దాడులు.. స్ఫూర్తి ఆపరేషన్ సిందూర్.!
Publish Date:Jul 9, 2026
Advertisement
భారత సైన్యం గతంలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వ్యూహాత్మక దాడులు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, శత్రువు కోలుకోలేని విధంగా భారత సైన్యం చేసిన ఆ దాడులు పాకిస్థాన్ కు ఉన్న ఉగ్ర సంబంధాలను నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. అలాగే ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఉగ్రవాద ముఠాలను పూర్తిగా తుడిచిపెట్టేసింది లేదా మట్టికరిపించింది. ఆ దారుణ నష్టం నుంచి కోలుకోవడానికే మునీర్‌కుచాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు సరిగ్గా అదే భారత ఆర్మీ వ్యూహాన్ని, దాడుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు పాక్ సైన్యంపై విరుచుకుపడటం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. బలూచిస్థాన్ తిరుగుబాటు దారుల దాడులు.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు దిమ్మతిరిగేలా చేశాయనడంలో సందేహం లేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కొంతకాలంగా బలుచిస్థాన్ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన కుర్చీ కాపాడుకోవాలంటే.. బలూచిస్థాన్ లో తిరుగుబాటును, నిరసనలను అణిచివేయడం అనివార్యమన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బలూచిస్థాన్ నిరసనకారులు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై సాయుధ పోరాటాన్ని సాగిస్తున్నారు. సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తూ పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. బలూచ్ ఉద్యమాన్ని అణచడంలో మునీర్ పూర్తిగా విఫలమయ్యారంటూ పాకిస్తాన్ ప్రతిపక్షాలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ రాజకీయ ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మునీర్ తన సైన్యాన్ని భారీగా మోహరించి బలప్రదర్శనకు దిగారు. కానీ అక్కడి స్థానిక ప్రజల నుంచి ఊహించని స్థాయిలో తీవ్ర నిరసనలు, వ్యతిరేకత ఎదురుకావడంతో పాక్ సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ అవమానం నుంచి తేరుకోకముందే బలూచ్ తిరుగుబాటుదారులు గ్వాదర్ ప్రాంతంలో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ ప్రధాన శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యూహాత్మక ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రదర్శించిన మెరుపు దాడుల వ్యూహాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు బలూచ్ తిరుగుబాటుదారులు చెడుతున్నారు. బలూచ్ దాడులలో పలువురు పాకిస్తాన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం పాక్ సైనిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా.. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు కోలుకోలేని వ్యక్తిగత శోకాన్ని మిగిల్చింది.ఎందుకంటే.. ఈ దాడిలో మునీర్ స్వయానా బావమరిది అయిన కెప్టెన్ మహమ్మద్ జిబ్రాన్ కూడా మరణించాడు. తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి. పాకిస్తాన్ స్థానిక మీడియా కూడా ఈ పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తూ, ఆర్మీ చీఫ్ వైఫల్యాలను ఎండగడుతోంది. ఒకవైపు అంతర్గత తిరుగుబాట్లు, మరోవైపు సరిహద్దుల్లో వ్యూహాత్మక వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఆర్మీకి, రాబోయే రోజుల్లో బలూచ్ రెబల్స్ రూపంలో మరిన్ని చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. Operation, Sindoor, Inspiration, Pakistan Army Chief, Asim Munir, Telugu News
http://www.teluguone.com/news/content/attacks-by-baloch-insurgents-on-pakistan-36-225535.html





