తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు ఖాయం! కేసీఆర్ జైలుకు పోతారన్న బీజేపీ సీఎం
Publish Date:Jan 9, 2022
Advertisement
తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ. కానీ కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు మద్దతుగా హనుమకొండలో జరిగిన బీజేపీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బండి సంజయ్ పోరాటంలో న్యాయం ఉందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు హిమంత బిశ్వశర్మ. బీజేపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ హైద్రాబాద్ వస్తానన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయడం మాని, ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసుల సపోర్ట్ తో ఎక్కువ రోజుల పాలించలేరన్నారు. బండిని అరెస్ట్ చేసిన పోలీసులే రేపు కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారని చెప్పారు. ప్రజాశక్తి ముందు కేసీఆర్ డబ్బులు పనిచేయవన్నారు హిమంత బిశ్వశర్మ. ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకత లేదన్నారు. ఉద్యోగుల బదిలీలు ఎలా చేయాలో అస్సాంను చూసి నేర్చుకోవాలని సూచించారు. కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పెద్ద దగాకోరని, అవినీతి ముఖ్యమంత్రి అని అన్నారు. సొరంగంలో దాక్కున్నా కేసీఆర్ ను వదలిపెట్టేదిలేదని, జేసీబీలు పెట్టి చీల్చీ జైలుకు పంపుతామని అన్నారు. ఆయన కుటుంబాన్ని కూడా వదలమని స్పష్టం చేశారు. బండి సంజయ్‌ను లోపలేస్తే అంతా భయపడతారని సీఎం భావించారని.. గూగుల్‌లో ‘వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా’ అని కొడితే కేసీఆర్ పేరే వస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉండకపోవచ్చన్నారు. మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. హుజురాబాద్ పరిస్థితే తెలంగాణ అంతటా పునరావృతం అవుతుందని, కేసీఆర్ సర్కార్‌కి ప్రజలు ఘోరి కట్టడం ఖాయమని ఈటల రాజేందర్ హెచ్చరించారు. టీఆర్ఎస్ తామే ప్రత్యామ్నాయం అని కాషాయ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగులు ఫెన్ డౌన్ చేస్తే కేసీఆర్ సీఎం అయ్యారని బండి సంజయ్ అన్నారు. 317జీవోతో ఉద్యోగులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత కోసమే కదా తెలంగాణ తెచ్చుకుంది.. మరి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని జీవో తయారు చేశారని, ఈ జీవో ద్వారా ముఖ్యమంత్రి ఏం సాధిస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి కుటుంబానికి సంక్రాంతి లేకుండా చేస్తామన్నారు సంజయ్. గ్యాస్ కట్టర్లతో తన కార్యాలయాన్ని బద్దలు కొట్టారని, ఏ తప్పు చేయని బొడిగ శోభను జైల్లో పెట్టారని మండిపడ్డారు. 317 జీవోను వెంటనే సవరించాలని, లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ జీవోను చెత్తబుట్టలో వేస్తామన్నారు. సూది, దబ్బనం అని హేళన చేసిన కమ్యూనిస్టు పార్టీలకు కేసీఆర్ దావత్ ఇచ్చారని, తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో చేయి కలుపుతున్నారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
http://www.teluguone.com/news/content/assam-bjp-cm-hot-comments-on-cm-kcr-39-129921.html





