మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు
Publish Date:Aug 2, 2026
Advertisement
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ప్రతీకగా నిలుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రి.. తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు తమ తమ వృత్తుల్లో విజయం సాధించాలని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలని అమ్మవారి కరుణాకటాక్షాలను కోరుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుం టారని, బోనాల పండుగను కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలంతా భాగస్వాములై ఘనంగా జరుపుకుంటా రని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.గతంలో ఈ ప్రాంతంలో ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు అమ్మవారు ప్రజలను ఆదుకున్నారనే విశ్వాసం ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం కూడా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు.ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని బోనాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. Ashada Bonalu, Minister Ponnam Prabhakar, Ujjain Mahakali Ammavari Bonalalu, Hyderabad Bonalu Celebrations, Telangana Spiritual News, Telangana Goverment
http://www.teluguone.com/news/content/ashada-bonalu-36-227786.html





