అరెస్టా.. విచారణా.. పేర్ని జయసుధ ముందున్న దారేది?
Publish Date:Dec 27, 2024
Advertisement
మాజీ మంత్రి , వైసీపీ కీలక నేత పేర్ని నాని ఆయన కుటుంబం ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం మాయం సంఘటనలో ఆ కుటుంబంపై కేసు నమోదైన సంగతి తెలసందే. ఇందుకు సంబంధించి వాస్తవాల వెల్లడి విషయంలో పేర్ని నాని, ఆయన సతీమణి, కుమారుడు పూర్తిగా విఫలమయ్యారు. పోలీసుల నోటీసులు అందగానే గంపగుత్తగా కుటుంబం మొత్తంఅజ్ణాతంలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ కేసు విషయంలో పేర్ని నాని కుటుంబానిదే తప్పు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. జగన్ హయాంలోనూ, ఆ తరువాతా కూడా ఏ విషయంపైనైనా స్పందించడంలో, మీడియా ముందుకు వచ్చి వాగ్ధాటి ప్రదర్శించడంలో చురుకుగా ఉండే పేర్ని నాని.. తన కుటుంబంపై నమోదైన కేసు విషయంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయిచడమే కాకుండా పోలీసుల నోటీసులకు సైతం స్పందించకుండా అజ్ణాతాన్ని ఆశ్రయించడమే ఆయన వైపే తప్పు ఉందన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన రేషన్ బియ్యం కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మాయమైన రేషన బియ్యం బస్తాల సంఖ్య తొలుత వెలుగులోకి వచ్చిన దాని కంటే చాలా చాలా ఎక్కువ అన్న చర్చ జరుగుతోంది. పేర్ని నాని సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్ నుంచి 3,708 రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయని తొలుత అధికారులు తెలిపారు. ఆ తరువాత ఆ సంఖ్య తప్పు అంటూ సవరించి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య 4,840 అని చెప్పారు. అయితే తాజాగా ఇప్పుడు జయసుధ గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య ఏకంగా 7,577 అని లెక్క తేల్చారు. గోడౌన్ నుంచి మాయమైన బియ్యం బస్తాల సంఖ్య ఎంతో తేల్చడానికి నెల రోజుల సమయం ఎందుకు పట్టిందంటూ వైసీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోడౌన్ నుంచి భారీగా బియ్యం అక్రమంగా తరలించారని చెప్పడం కోసమే అంత సమయం తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం ఇంత స్థాయిలో బియ్యం తరలించడం మామూలు విషయం కాదనీ, పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చడానికి ఆ మాత్రం సమయం పడుతుందనీ చెబుతున్నారు. బియ్యం బస్తాల మాయం విషయంలో అవాస్తవముంటే.. మాయమైన బియ్యానికి పేర్ని నాని తాలూకు న్యాయవాది డీడీలు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నిస్తారు. ఇదంతా అలా ఉంచితే.. మరో వైపు పోలీసులు ఇచ్చిన నోటీసులపైన హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను పేర్ని నాని ఉపసంహరించుకున్నారు. కేసు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసు విచారణలో ఉండగా కేసుకు సంబంధించిన పలు అంశాలు తెరపైకి వస్తుండటం ఆసక్తి కరంగా మారింది. గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై డిసెంబరు 10న పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. అంతే కాకుండా పేర్ని నాని జయసుధకు చెందిన గోడౌన్ నుంచి మాయమైన బియ్యం ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి దేశం దాటేసిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు చేస్తున్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసిన ఆమె విచారణకు హాజరై ఉంటే కోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసి ఉండేదనీ, ఇప్పుడామె అజ్ణాతంలో ఉన్నందున కోర్టులో ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనీ వివరిస్తున్నారు. కోర్టు అరెస్టు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా కూడా విచారణకు హాజరై తీరాల్సిందేనని జయసుధకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన పేర్నినాని తన భార్య పేర్ని జయసుధ పేరిట రేషన్ డీలర్ షిప్ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు పంపిణీ కోసం అందిన బియ్యాన్ని తమ కుటుంబానికే చెందిన గోడౌన్ లో భద్రపరిచేవారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారం మారిన తరువాత అదే గోడౌన్ లో ఉండాల్సిన బియ్యం నిల్వలు మాయం అయినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచినా వారు రాలేదు. అయినా పోలీసులు ఇప్పటి వరకూ వారినెవరినీ అరెస్టు చేయలేదు. ఈ లోగా పేర్ని జయసుధ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువరించిన తరువాత పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఇంత జరిగినా పేర్ని నాని కనీసం స్పందించక పోవడంతో బియ్యం బస్తాల మాయం విషయంలో ఆయన కుటుంబం ప్రమేయం ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది. అయిన దానికీ కాని దానికీ తెలుగుదేశం, జనసేనలపై నోరెట్టుకు పడిపోయే పేర్ని నాని.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తన కుటుంబంపై కేసు నమోదైనా కిమ్మనకపోవడంతో ఆయన కుటుంబం తప్పిదం ఉందన్న సంగతిని పరోక్షంగా అంగీకరించేసినట్లేనని అంటున్నారు. పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి మరీ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించినందున జయసుధకు కోర్టులో ఊరట దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనని న్యాయ నిపుణులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/arrest-or-attend-police-questioning-39-190394.html