ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా?
Publish Date:Oct 18, 2022
Advertisement
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? 2014 ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడుస్తున్నాయా.. ఇందుకు బీజం చాలా కాలం కిందటే పడిందా. అందుకు సంబంధించి ఇప్పుడు ఒక స్పష్టత వస్తోందా అంటే వరసగా గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనక తప్పదు. విశాఖ గర్జన సందర్భం గా విశాఖపట్నం విమానాశ్రయం వద్ద జరిగిన ఘర్షణ, అది సాకుగా తీసుకుని పోలీసులు జనసైనికులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అంతటితో ఆగకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నోవాటెల్ హోటల్ దాటి బయటకు రాకుండా అడ్డుకోవడం, ఆంక్షల పేరు చెప్పి జనవాణి జరగకుండా ఆపడం వరకూ ప్రతి సంఘటనా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రెండు రోజుల పాటు విశాఖలో నోవాటెల్ హోటల్ కే పరిమితమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అన్ని రాజకీయ పార్టీలూ మద్దతుగా నిలిచాయి. సంఘీభావం ప్రకటించాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పవన్ కల్యాణ్ తో మాట్లాడారు. విశాఖ ఘటనలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. జనసేన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే ఇటీవల కొద్ది కాలంగా జనసేనతో అంటీముట్టనట్టున్న మిత్రపక్ష బీజేపీ కూడా విశాఖ ఘటనల నేపథ్యంలో జనసేనకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా జనసేన తమ మిత్రపక్షమని ఎలుగెత్తింది. వామపక్షాలు కూడా జనసేనకు అండగా ఉంటామని ప్రకటించాయి. ఇప్పుడు విశాఖ సీన్ విజయవాడకు మారింది. విశాఖ నుంచి తిరిగి వచ్చిన జనసేన అధినేత ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో బేటీ అయ్యారు. అలాగే విజయవాడ నోవాటెల్ హోటల్ లో జనసేనానిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కలిశారు. విశాఖ ఘటనలపై ఆరా తీశారు. ప్రభుత్వ నిర్బంధాన్ని, నియంతృత్వాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలన్న దిశగా వారి మధ్య చర్చ జరిగిందని సమాచారం. అలాగే అమరావతి రైతుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన ఇరు పార్టీలూ ఇకపై కలిసికట్టుగా అమరావతి రైతుల పక్షాల గళమెత్తాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్ లో ఈ సంఘీభావం ఎన్నికల పొత్తు కు దారి తీస్తుందా అన్న చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాలలో ప్రారంభం అయ్యింది. కొద్ది కాలం కిందట అంటే రాష్ట్ర పతి ఎన్నిక సందర్భంగా బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ బీజేపీపై ఎంత ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడం, చంద్రబాబుకు 12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వీటన్నిటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరౌతున్నాయనడానికి తార్కానంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే గతంలో ఢిల్లీలో మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి కేంద్రం నుంచి అందిన ఆహ్వానం మేరకు చంద్రబాబు హస్తిన వెళ్లడం, ఆ సందర్బంగా కొద్ది సేపు మోడీతో ముచ్చటించడాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/are-political-equations-changing-in-ap-25-145651.html