అపెండిక్స్ అవసరమే
Publish Date:Jan 10, 2017
Advertisement
ఇంతకుముందు వరకూ ఒక జీవి నివసించే వాతావరణానికి అనుగుణంగానో, అది తీసుకునే ఆహారానికి అనుగుణంగానో అపెండిక్స్ ఏర్పడేదనుకునేవారు. కానీ తాజాగా తేలిందేమిటంటే అపెండిక్స్ ఉన్న జీవుల పేగులలో, శరీరానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉందట. అంటే పేగులలో ఇలాంటి బ్యాక్టీరియా ఏర్పడేందుకు అపెండిక్స్ సహకరిస్తోందని తేలిపోయింది. దీని వలన మనకు డీసెంట్రీ, కలరా, డయేరియా వంటి సమస్యలు ఏర్పడినప్పుడు, జీర్ణవ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ఈ అపెండిక్స్ ఉపయోగపడుతుందన్నమాట. - నిర్జర.
అపెండిసైటిస్ – ఇది మనం తరచూ వినే ఆపరేషనే! మన పేగులకు అనుసంధానంగా ఉండే అపెండిక్స్ అనే అవయవం దెబ్బతినడమే అపెండిసైటిస్. దానిని ఆపరేషన్ ద్వారా తొలగించే ప్రక్రియను అపెండెక్టమీ అంటారు. మానవ పరిణామ క్రమంలో ఈ అపెండిక్స్ ఒక వ్యర్థ అవయవంగా మిగిలిపోయిందనీ, దీని వల్ల హానే కానీ ఉపయోగం లేదన్నది మన భావన. అందుకనే ఏదన్నా మిగతా ఆపరేషన్ చేయించుకునే సమయంలో, కొందరు తమ అపెండిక్స్ను కూడా తీసిపారేయమని అడుగుతుంటారు.
ఒకోసారి అపెండిక్స్ మనల్ని ఇబ్బంది పెట్టే మాట వాస్తవమే! ఏదన్నా క్రిములు ఇందులోకి చేరడం వల్ల ఇది వాచిపోయి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చే మాటా నిజమే! అయితే అపెండిక్స్ అవయవం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగమూ లేదన్న వాదనకి విరుద్ధంగా ఈమధ్య అనేక పరిశోధనలు వెలువడుతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిశోధన గురించే చెప్పుకొందాం.
అమెరికాకు చెందిన డా॥స్మిత్ అనే శాస్త్రవేత్త అపెండిక్స్ వ్యర్థమైనదా కాదా అని తెలుసుకునేందుకు ఒక రీసెర్చి బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వీరు 533 క్షీరదాలకి సంబంధించిన జీర్ణవ్యవస్థ పరిణామ క్రమాన్ని పరిశీలించారు. వీటిలో చాలా సందర్భాలలో అపెండిక్స్ అనే అవయవం ఏదో స్వతంత్రంగా కాకుండా ప్రత్యేక వ్యవస్థలో భాగం ఏర్పడుతున్నట్లు తేలింది. అంతేకాదు! అలా ఒకసారి ఏర్పడిన తరువాత ఎన్ని తరాలు గడిచినా కూడా సదరు క్షీరదపు జీర్ణవ్యవస్థలో భాగంగానే ఉండిపోయింది. అంటే దీనికి ఒక స్పష్టమైన ప్రయోజనం ఏదో ఉండి ఉంటుందన్న అనుమానం ఏర్పడింది. ఏమిటా ప్రయోజనం అన్న పరిశీలన మరిన్ని వాస్తవాలకు దారితీసింది.
అపెండిక్స్ ఉన్న జీవులలో ‘లింఫాయిడ్ టిష్యూ’ అనే తరహా కణాలు పెరుగుదల కూడా బాగుందట. మన జీర్ణవ్యవస్థ మీద ఎలాంటి క్రిములూ దాడి చేయకుండా ఉండేందుకు ఈ లింఫాయిడ్ కణాలు దోహదపడతాయి. ఈ పరిశోధనతో అపెండిక్స్ మీద ఉన్న అపోహలన్నీ తొలగిపోవచ్చు. ఇకమీదట మరీ అత్యవసరం అయితే తప్ప, అటు వైద్యలూ ఇటు రోగులూ కూడా అపెండిసైటిస్ ఆపరేషన్ జోలికి పోకపోవచ్చు.
http://www.teluguone.com/news/content/appendix-34-71010.html





