ఒక మంత్రి అరెస్టు చేయించి సంబరాలు.. మరో మంత్రి అరెస్టుపై నిరసనలు.. ఆప్ భిన్న స్పందనలు
Publish Date:May 31, 2022
Advertisement
సమాజంలో అవినీతిని చీపురుతో తుడిచేస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులే అవినీతి కేసులలో ఇరుక్కుంటున్నారు. ఆప్ మంత్రుల అవినీతిపై పార్టీ స్పందిస్తున్న తీరు కూడా భిన్నంగా ఉంటున్నది. పంజాబ్ లో ఆప్ మంత్రి కమిషన్ డిమాండ్ చేశారంటూ.. ముఖ్యమంత్రి మాన్ ఆయనను బర్త్ రఫ్ చేస్తే అభినందనలతో జేజేలు పలికిన పార్టీ అగ్రనేతలు... ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్టు చేస్తే మాత్రం రాజకీయ వేధింపులు అంటూ మండి పడుతున్నారు. మొత్తంగా చూస్తే రెండు అరెస్టులూ అవినీతి ఆరోపణలపైనే.. అరెస్టయిన ఇద్దరూ ఆప్ మంత్రులే.. అయితే ఒక మంత్రి అరెస్టును స్వాగతించిన ఆప్.. మరో మంత్రి అరెస్టుపై ఎందుకు గగ్గోలు పెడుతోంది. కేంద్రం వేధింపులంటూ విమర్శలు చేస్తున్నది. ఈ రెండు అరెస్టులలో పంజాబ్ లో మంత్రిని బర్త్ రఫ్ చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించింది స్వయానా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అందుకు ఆయన చెపపిన కారణం తన కేబినెట్ సహచరులు విజయ్ సింగ్లా కాంట్రాక్టర్ల నుంచి ఒక శాతం కమిషన్ డిమాండ్ చేశాడనీ, అవినీతికి ఆప్ ఏ స్థాయిలోనూ సహించదనీ భగవంత్ మాన్ చెబుతూ ఆయనను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారు. కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశించారు. ఇందుకు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆప్ అవినీతిని తుడిచేస్తుందనడానికి మాన్ చర్యే నిదర్శనమంటూ ప్రశంసలు కురిపించారు. అదే ఢిల్లీ మంత్రి సత్యేంద్ర పాల్ విషయానికి వచ్చే సరికి మాత్రం కేంద్రం వేధింపులంటూ విమర్శలకు దిగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ఆప్ ఇన్ చార్జి అయిన సత్యేంద్రజైన్ ను కుట్రపూరితంగా కేంద్రం అరెస్టు చేయించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు. అయితే పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ తమ మంత్రి అరెస్ట్ ను ఆప్ సమర్థించడం లేదు. రాజకీయ కుట్ర చేశారని ఆరోపిస్తోంది. సత్యేందర్ జైన్ హిమాచల్ ప్రదేశ్‌కు ఆప్ ఇంచార్జ్ గా ఉన్నారు. అక్కడ ఎన్నికల సన్నాహాల కోసం ఆయన హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉండగా అరెస్ట్ చేశారని ఇది రాజకీయ కుట్రేనని ఆప్ అంటోంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని .. తమ పార్టీ నేతలను వేధిస్తోందని అంటున్నారు. సత్యేందర్ జైన్ హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లకుండానే ఈ కేసు పెట్టారని అంటోంది. అయితే బీజేపీ మాత్రం ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారని అంటోంది. ఓ మంత్రిని అరెస్టు చే యించి గొప్పలు చెప్పుకుంటున్న ఆప్ నాయకత్వం ఇంకో మంత్రి అరెస్ట్ కు గగ్గోలు పెడుతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/app-different-reactions-on-ministers-arrests-25-136719.html





