ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీని తొలగించిన ఎస్ఈసీ! మరికొన్ని గంటల్లో తొలి దశ ఎన్నికల షెడ్యూల్
Publish Date:Jan 22, 2021
Advertisement
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మరింత జోరు పెంచింది ఏపీ ఎన్నికల సంఘం. విధులకు సహకరించని అధికారులపై ప్రత్యక్ష చర్యలకు దిగింది. 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ తొలగించింది. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలను కూడా ఎస్ఈసీ తొలగించింది. మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌కు ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. శనివారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అధికారులతో వరస భేటీలు అవుతున్నారు. ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సుమారు 20 నిముషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు అంశాలు, ఎన్నికల ప్రక్రియ అంశాలు, షెడ్యూల్ వివరాలు గవర్నర్‌కు వివరించారు. ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులు నిమ్మగడ్డ భేటీ కావాల్సి ఉంది. అయితే ఎస్ఈసీ ముందు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు హాజరుకాలేదు.
స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ను వెనక్కిచ్చేసింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. దీనివల్ల సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/ap-sec-releave-two-collecters-from-election-duty-in-ap-39-109133.html





