'ప్రత్యేక' ప్రకటనకి కారణం పవనా? చంద్రబాబా?
Publish Date:Sep 1, 2016
Advertisement
ప్రత్యేక హోదా... మొన్నటి వరకూ ఇదే ప్రయోగం వినిపించేది ఎక్కడ చూసినా! కాని, ఇప్పుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్రకటన అనేది వినిపిస్తోంది! అంటే ఏంటో ఇప్పటికిప్పుడు ఎవరికీ తెలియదు. కాని, ప్రత్యేకమైన ప్రకటన ఒకటి ఏపీ కోసం చేస్తారని మాత్రం అందరి అంచనా. అందుకు తగ్గట్టే ఢిల్లీలో అలజడి కూడా వుంది. వెంకయ్య, సుజనా చౌదరి లాంటి ఏపీ నేతలు బిజీబిజీగా మీటింగ్ లకు అటెండ్ అవుతున్నారు. జైట్లీ, షా లాంటి హస్తిన పెద్దలు కూడా ఏపీపైన దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది....
ప్రత్యేక హోదా ఇస్తామని గత యూపీఏ ప్రభుత్వం చట్ట సభలో అధికారికంగా చెప్పింది. అందుకు కారణం కూడా వెంకయ్య నాయుడే. ఆయనే ఒంటరిగా లేచి నిల్చుని ప్రత్యేక హోదా కావాలని నినదించారు. మన్మోహన్ తో ప్రకటన చేయించారు. అయితే, ఇప్పుడు అదే బీజేపి పెద్దలకు తలనొప్పిగా మారింది! ప్రత్యేక హోదా ఇవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలిక కాదు. ఒక్క ఆంద్రప్రదేశ్ కు ఇస్తే అది అక్కడితో ఆగేది కూడా కాదు. ఇంకా చాలా రాష్ట్రాలు అదే డిమాండ్ తో ముందుకు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా స్పెషల్ స్టేటస్ కోరే ఛాన్స్ వుంది. ఇలాంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ మాత్రమే రాజ్యాంగ బద్ధంగా కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం వుంది ప్రత్యేక హోదా విషయంలో. అందుకే, ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ లేదా ప్రత్యేక ప్రకటనగా మారిపోయింది. ఇంతకీ ప్రత్యేక ప్రకటనలో వుండేదేంటి?
ప్రత్యేక ప్రకటనలో మోదీ సర్కార్ ఏపీకి ఇచ్చేదేంటో ఇప్పుడే తెలియదు. కాని, ప్రత్యేక హోదాలో వుండే అన్ని లాభాలు ఇందులో వుంటాయని అంటున్నారు. కాని, అంత పెద్ద వరాల చిట్టా హఠాత్తుగా కేంద్రం ఇప్పుడెందుకు విప్పుతోంది? కారణం పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే, పవర్ స్టార్ సభ పెట్టి బీజేపిని ఇస్టానుసారం విమర్శించాకే ఢిల్లీలో కదలిక వచ్చింది. కాని, ఇప్పుడు కొన్ని వర్గాల సమాచారం ప్రకారం మరో విషయం తెలుస్తోంది!. ఎన్డీఏలో టీడీపి భాగస్వామి. మోదీతో ఎన్నికల ముందు చాలా పార్టీలు జట్టు కట్టటానికి వెనుకంజ వేశాయి. కాని, అలాంటి సమయంలోనే చంద్రబాబు స్నేహ హస్తం అందించారు. ఓటింగ్ కంటే ముందే ఎన్డీఏలో భాగస్వామిగా వుండి నవ్యాంధ్రలో బీజేపి గెలుపుకు వీలైనంత సహకరించారు. 2014 తరువాత కూడా గత రెండేళ్లుగా శివసేన లాంటి ఎన్డీఏ పక్షాల్లాగా టీడీపీ అల్లరి పెట్టలేదు. ఎన్డీఏలో క్రమశిక్షణగానే మెదులుతూ వచ్చింది.
రెండేళ్లుగా టీడీపీ ఎన్డీఏకు ఎంతగా సహకరించినా ప్రత్యేక హోదా విషయంలో మోదీ క్యాబినేట్ ఎలాంటి డెసీషన్ తీసుకోలేదు. దీని వల్ల చంద్రబాబు గవర్నెమెంట్ జనం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అంతే కాదు, ఏపీకి మేలు జరగకున్నా ఎందుకు ఎన్డీఏలో వుంటున్నారనే వారు కూడా ఎక్కువైపోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు తన అంతిమ అస్త్రంగా ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని చెప్పారంటున్నారు. కేంద్రం పెద్దలకు బాబు ఇక మా వల్ల కాదు మేం గుడ్ బై చెప్పేస్తాం అనటంతోనే కాస్త కదలిక వచ్చిందట! దాని ఫలితమే ప్రత్యేక ప్రకటన కసరత్తు అని కూడా తెలుస్తోంది...
నిజంగా చంద్రబాబు వారెంట్ ఇచ్చారో లేదో తెలియదుగాని ఏదో ఒక కారణం చేత రాష్ట్రానికి మేలు జరిగితే అదే చాలు!
http://www.teluguone.com/news/content/ap-reorganisation-act-45-65896.html





