నా అనుచరులు పేకాటలో ఉంటే ఏంటీ? గడ్డం గ్యాంగ్ పై కొడాలి రియాక్షన్
Publish Date:Jan 4, 2021
Advertisement
మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో పేకాట రాయుళ్ల అరెస్ట్ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి అండదండలతోనే గుడివాడలో పేకాట క్లబ్లులు నడుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే గుడివాడ గడ్డం గ్యాంగ్ అరెస్ట్ పై స్పందించిన మంత్రి కొడాలి నాని.. అదో చిన్న విషయంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం మరింత వివాదమవుతోంది. గుడివాడ ఘటనపై మాట్లాడిన కొడాలి నాని.. పేకాట ఆడిన వారిలో తన అనుచరులు ఉంటే ఏమవుతుందని ఎదురు ప్రశ్నించారు. పేకాట ఆడుతూ దొరికిపోయిన వాళ్లలో తన అనుచరులు ఉన్నా, తన తమ్ముడే ఉన్నా ఇబ్బందేమీలేదని, వాళ్లకేమైనా ఉరిశిక్ష వేస్తారా? అంటూ లైట్ తీసుకున్నారు. పట్టుకుంటే జరిమానా కట్టించుకుని వదిలేస్తుంటారు కాబట్టే హద్దు అదుపు లేకుండా పేకాట ఆడుకుంటుంటారని మంత్రి కొడాలి వివరించారు. తన ఇలాకాలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, తానే వాటి వెనకుండి నడిపిస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తానే పేకాట క్లబ్బులు నడిపిస్తున్నట్టయితే పోలీసులు దాడులు చేయగలరా? అని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా పేకాట ఆడేవాళ్లకు పార్టీలు ఉంటాయా ? అని అన్నారు. గుడివాడలో పేకాట క్లబ్బులపై మీడియాలో వచ్చిన కథనాలతో మంత్రి కొడాలి నాని ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. దీంతో అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ ను కలిశారు. సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపో.. లేక ఈ మొత్తం ఘటన పై వివరణ ఇచ్చుకునేందుకు ఆయనే వెళ్లారో తెలియలేదు కానీ హఠాత్తుగా మంత్రి నాని సీఎం ఇంటికి వెళ్ళడం మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే పేకాట రాయుళ్ల కోసం తాను సీఎం జగన్ వద్దకు పరిగెత్తుకు రావాల్సిన అవసరంలేదని చెప్పారు కొడాలి నాని. తాను సీఎం వద్దకు వచ్చానంటే అది పాలనకు సంబంధించిన విషయాల కోసమేనని తెలిపారు. గుడివాడ నుంచి కంకిపాడు వెళ్లే రోడ్డు, వయా మానికొండ మీదుగా వెళ్లే రోడ్డుకు సంబంధించిన పనులను ఎన్డీబీ రెండో ఫేజ్ లో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి సీఎంను కలిశానని వివరణ ఇచ్చారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన గుడివాడ ప్రజల కోసం తాను సీఎ జగన్ ను కలిశానే తప్ప పేకాటరాయుళ్ల కోసం రావాల్సిన అగత్యం తనకు పట్టలేదని అన్నారు. అలాంటి చిల్లర పనులు చేసేది చంద్రబాబు, దేవినేని ఉమ అని విమర్శించారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేకాట ఆడుతూ తన అనుచరులు అడ్డంగా దొరికినా మంత్రి ఇంకా బుకాయిస్తున్నారని మండిపడుతున్నాయి. పేకాట ఆడితే తప్పేంటని మాట్లాడుతున్న కొడాలి.. గడ్డం గ్యాంగ్ కు సపోర్ట్ చేస్తున్నారా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేకాడుతూ దొరికిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరడం పోయి.. దొరికితే ఏమవుతుంది.. వాళ్లకేమైనా ఉరి శిక్ష వేస్తారా అంటూ మంత్రి మాట్లాడటం దారుణమంటున్నారు జనాలు. అక్రమంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న కొడాలి నానిని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం లేనిది గుడివాడ నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పడానికి మంత్రి గారికి ఇప్పుడే కనిపించినట్లున్నాయని తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ap-minister-kodali-nani-reaction-on-gudiwada-arest-39-108503.html





