అత్యాచార* ఎప్పుడు, ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలీదా?
Publish Date:Apr 23, 2022
Advertisement
విజయవాడ ప్రభుత్వాసుపత్రి అత్యాచార ఘటన యావత్ తెలుగుజాతిని కలిచివేస్తే.. హోంమంత్రి తానేటి వనిత మాత్రం ఎలాంటి ప్రాధమిక సమాచారం లేకుండా మీడియా ముందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యారు. మీడియా మైక్‌లు ఆన్‌లో లేవనుకున్నారో ఏమో.. అత్యాచారం ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇవాళ డేట్ ఎంత? ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటూ అధికారులను సమాచారం అడిగి తెలుసుకోవడం.. అదికాస్తా రికార్డు కావడం.. ఆ వీడియో ఫుల్ వైరల్ కావడంతో ప్రభుత్వ పరువంతా పోయింది. హోంమంత్రిగా ఉండికూడా.. అంత ఘోరం జరిగితే కూడా.. కనీస సమాచారం లేకుండా ఎలా ఉంటారు? ఆమె హోంమంత్రిగా ఎలా పనికి వస్తారు? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు, ట్రోల్స్ నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వనీత తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై నిలదీస్తూ సీఎం జగన్‌కు మూడు పేజీల లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా...... "రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోంది. ప్రభుత్వ ఉదాసీనత వల్లే అభం శుభం తెలియని చిన్నారులు నుంచి వృద్ధుల వరకూ కిరాతకుల ఆగడాలకు బలవుతున్నారు. రాష్ట్రంలో విద్యార్థినులు,యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతుండటం దురదృష్టకరం. రాష్ట్రంలో బడికి వెళ్లే బాలికలకు, కాలేజీలకు వెళ్లే యువతులకు, మార్కెట్ కు వెళ్లే మహిళలకు, ఉద్యోగాలు చేసుకునే ఆడబిడ్డలకు రక్షణ లేదు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన నన్నెంతో కలిచివేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యం. నిత్యం రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వాస్పత్రిలోని ఒక రూమ్ లో దివ్యాంగురాలికి 30 గంటలపాటు ముగ్గురు మృగాళ్లు మద్యం తాగి నరకం చూపించడం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉందో అర్ధమవుతోంది. తల్లిదండ్రుల ఎదుటే బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డారంటే... ఏం చేసినా ప్రభుత్వం శిక్షించదనే ధైర్యంతోనే కిరాతకులు రెచ్చిపోతున్నారు. కూతురు కనిపించడంలేదని స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితురాలి తల్లిదండ్రలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అమానుషం. మహిళా భద్రతను వదిలేసి అధికార పార్టీ సేవలో పోలీసులు తరించడం దేనికి సంకేతం? రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దురాగతాలు గుండెను పిండేస్తున్నాయి. విజయవాడలో బాధితురాలిని మేము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రజాగ్రహం చూసి భయపడి ఆదరాబాదరగా హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఘటనాస్థలానికి వచ్చారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. బాధితులకు అండగా నిలబడి న్యాయం చేయమని కోరితే తమ బాధ్యతను మరిచి మాపై ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు పెచ్చుమీరిపోతున్నాయి. గంజాయి, డ్రగ్స్ , మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ అసమర్థ చర్యలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పాలనా వైఫల్యం నేరస్థులకు మద్దతుగా నిలుస్తున్నట్టున్నాయి. జాతీయ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరం. మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపు ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయం. దిశా చట్టం ఆర్భాటపు ప్రచారానికే పరిమితమైంది. దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్దానం ఏమైంది? రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంతమందిని శిక్షించారు?అనే ప్రశ్నలకు నేటికీ మీ నుంచి సమాధానం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ ఆ దిశగా చర్యల్లేవు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీ చర్యలు, మీ విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలి. ఇకనైనా మహిళా భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించి, శాంతిభద్రతలు కాపాడండి. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించండి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలి. కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, శాశ్వత నివాసం, జీవనోపాధి కల్పించాలి. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసును వెంటనే పరిష్కరించి దోషులను కఠినంగా శిక్షించాలి". అంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.
మహిళలకు రక్షణ కల్పించలేని మీకు పాలన చేసే అర్హత ఎక్కడుంది? అధికార వైసీపీ నేతలే కాలకేయుల అవతారమెత్తి ఆడవారిపై దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లాలో చిన్నారిపై అధికార పార్టీ నేతలు భూ శంకర్, ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు అఘాయిత్యానికి పాల్పడి వ్యభిచార గృహానికి అమ్మేశారు. వీరితోపాటు ఈ ఘటనతో ప్రమేయమున్న 70 మందిపై నేటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజధాని ప్రాంతం పెదకాకానిలో దళిత విద్యార్థిని రమ్యను పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపితే నిందితుడికి నేటికీ శిక్ష పడలేదు. పులివెందులలో నాగమ్మ, అనంతపురంలో స్నేహలత, నరసరావుపేటలో అనూష, రాజమండ్రిలో మైనర్ మీద గ్యాంగ్ రేప్ ...ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైనా ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నారు? నెల్లూరులో విదేశీ యువతిపై అత్యాచార యత్నం అంతర్జాతీయస్థాయిలో రాష్ట్ర పరువు పోయింది.
http://www.teluguone.com/news/content/ap-home-minister-taneti-vanitha-comments-goes-viral-25-134859.html