హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్ కు కోర్టు ఆదేశం
Publish Date:Dec 14, 2022
Advertisement
కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా జగన్ సర్కార్ కు బొప్పి కట్టడం లేదు. కోర్టు ఆదేశాలను ఖాతరు చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా సర్కార్ వ్యవహార శైలి ఉంది. తాజాగా హైకోర్టు మరో సారి ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పాఠశాలల ఆవరణల్లో ఇతర నిర్మాణాలేవీ చేపట్టరాదని హైకోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హై కోర్టు ఆదేశాల తరువాత కూడా పాఠశాల ఆవరణల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విస్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా వాటిని ఖాతరు చేయకుండా కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయడం, నిర్మాణాలు చేపట్టడంపై స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సర్కార్ తీరు, అధికారుల వ్యవహార శైలిపై కోర్టు గతంలో కూడా పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. సీఎస్ కు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడానికి ఒక్క రోజు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి నెల రోజులు జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించింది. ఇలా పలు సందర్భాలలో కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ అధికారులు కోర్టు మందలింపులకు, శిక్షలకు గురయ్యారు.
http://www.teluguone.com/news/content/ap-high-court-orders-cs-jawahar-reddy-to-attaend-before-court-25-148525.html





