ఏపీలో నెైట్ కర్ఫ్యూ.. థియేటర్లలో 50 శాతం సీటింగ్
Publish Date:Jan 10, 2022
Advertisement
కొవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం కొవిడ్ పరిస్థితులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచే కర్ఫ్యూ అమలు కానుంది. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కొవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలన్నారు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని సూచించారు. మాస్క్ తప్పనిసరి చేయాలన్నారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలన్నారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలని సీఎం సూచనలు చేశారు. కొవిడ్ చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం జగన్. అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 104 కాల్ సెంటర్‌ను బలంగా ఉంచాలని.. ఎవరు కాల్చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ కేర్ సెంటర్లను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. నియోజకవర్గానికి ఒక కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/ap-govt-imposed-night-curfew-39-129964.html





