అప్పుడు చప్పట్లు.. ఇప్పుడు తిట్లు.. వాత తేలాక తెలిసింది జగనన్న కోత!
Publish Date:Jan 13, 2022
Advertisement
జగనన్న పీఆర్సీ ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నేతలు చప్పట్లు కొట్టారు. అంతా బాగుందన్నారు. ఇంటికెళ్లి పీఆర్సీ లెక్కలు వేసుకున్నాక తెలిసొచ్చింది.. జగనన్న కోత-వాత ఏ రేంజ్లో ఉందో. అందుకే అప్పటి నుంచీ తమకు జగనన్న పీఆర్సీ వద్దు.. చంద్రబాబు పీఆర్సీనే ముద్దు అంటూ నినదిస్తున్నారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు. ఇక కీలకమైన హెచ్ఆర్ఏపై ఏటూ తేల్చకుండా వ్యూహాత్మక మౌనం పాటించడంతో.. ఆ కోత ఇంకెంత వాత పెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పీఆర్సీ ప్రకటిస్తే పెరగాల్సిన జీతం.. తగ్గబోతుందని తెలిసి కాలుగాలిన పిల్లుల్లా సీఎంవో చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారులతో చర్చల మీద చర్చలు.. భేటీల మీద భేటీలు జరుపుతున్నారు. అయినా.. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. బుధవారం రాత్రి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలు.. గురువారం ఉదయం మరోసారి సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఫిట్మెంట్పై ఉద్యోగులంతా అసంతృప్తిగా ఉన్న వేళ .. గత ప్రభుత్వం కల్పించిన రాయితీల్లో కోతలు వేయడం సరికాదని కోరారు. అయితే, ప్రస్తుతానికి అధికారుల నుంచి ఒకే ఒక హామీ లభించింది. సంక్రాంతి ముగిసే వరకు హెచ్ఆర్ఏ సహా ఇతర అంశాలకు సంబంధించిన జీవోలు విడుదల చేయబోమని సీఎంవో అధికారులు హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. హెచ్ఆర్ఏపై అధికారుల నుంచి స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హెచ్ఆర్ఏ స్లాబులను కేంద్ర ప్రభుత్వ స్లాబులతో పోల్చడం వల్ల సచివాలయ హెచ్వోడీ ఉద్యోగులు 22 శాతం, జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులు దాదాపు 12 శాతం, మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5శాతం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 4.5శాతం హెచ్ఆర్ఏ కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగి స్థాయిని బట్టి 2వేల నుంచి 15వేల వరకూ సాలరీ తగ్గే అవకాశం ఉందని తెలిపారు. హెచ్ఆర్ఏ తగ్గించొద్దని కోరారు. సీఎం జగన్తో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యల ఆధారంగా ఉద్యోగుల కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/ap-govt-emp-angry-on-prc-39-130184.html





