ఏ ‘రాజధాని’ అభివృద్ధికి ఏపీ రుణం?
Publish Date:Nov 24, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఖజానాలోని నిధులను ఇష్టం వచ్చినట్లు వాడేసింది జగన్ రెడ్డి సర్కార్. ఖజానాను గుల్ల చేసేసింది. అధికారులను భయపెట్టి అన్ని ప్రభుత్వ విభాగాల్లోని నిధులను కూడా లాగేసుకుంది. గ్రామ పంచాయతీ ఖాతాలనూ జీరో చేసేసింది. గ్రామపంచాయతీల్లో ఉన్న కొద్దిపాటి నిధులతో కూడా కరువు తీర్చుకోవాలని చూసింది. అయినప్పటికీ రాష్ట్ర సర్కార్ రోజువారీ ఖర్చులకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితితోకి జారిపోయింది. ఇవన్నీ ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో.. అసలు అది ఎక్కడ ఉందో కూడా తెలియని స్థితిలో ‘రాజధాని అభివృద్ధి’ పేరిట 50 వేల కోట్ల రూపాయలు కావాలంటూ ప్రపంచబ్యాంకుకు టెండర్ వేసేందుకు యత్నించడం అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. రాజధాని అంటే అది అవరావతా? లేక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని వైసీపీ సర్కార్ చెబుతున్న విశాఖా? అదీ కాకపోతే న్యాయ రాజధాని అని తెరపైకి తెచ్చిన కర్నూలా? అనే దానిపై ఎలాంటి స్పష్టతా లేకపోవడం గమనార్హం. అసలు ఏ రాజధానిని ఏపీ సర్కార్ అభివృద్ధి చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఏపీ సర్కార్ చీటికీ మాటికీ ‘ఓవర్ డ్రాఫ్ట్’ అంటూ పరుగులు పెడుతోంది. నిధుల కోసం ఆర్థిక మంత్రి తరచూ ఢిల్లీలో కేంద్ర పెద్దల ముందు మోకరిల్లుతూనే ఉన్నారు. అప్పు కోసం వారం వారం ఆర్బీఐ వద్ద ఏపీ ప్రభుత్వం దేబిరిస్తూనే ఉంది. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం పెడుతోంది. అప్పు ఇవ్వండి మహాప్రభో! అంటూ బ్యాంకులను వేడుకుంటోంది. అయినా పని కాకపోవడంతో.. ఏకంగా ప్రపంచబ్యాంకుకు 50 వేల కోట్లకు టెండర్ వేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అయిపోయింది. ఏ రాజధాని అభివృద్ధి కోసం ఇంత రుణం అవసరమో.. ఒకవేళ ప్రపంచబ్యాంకు అప్పు ఇస్తే.. నిజంగా అభివృద్ధి కోసమే ఆ డబ్బులు ఖర్చు చేస్తారా? లేదంటే అలవాటు ప్రకారం దారి మళ్లిస్తారా? అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఏదో రకంగా అప్పు తెచ్చుకోవడమే ఏపీ సర్కార్ లక్ష్యం. అది సక్రమమా? లేక అక్రమమా అనేది జగన్ సర్కార్ పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. అన్ని పరిమితులూ దాటేసి, అప్పు పుట్టని పరిస్థితికి వెళ్లింది. ఇక పూట గడవని దుస్థితిలోకి జారుకుంది. స్థానికంగాను, జాతీయ స్థాయిలోనూ ఏపీ సర్కార్కు చిల్లి గవ్వ కూడా అప్పు పుట్టడం లేదు. ఈ క్రమంలో జగన్ సర్కార్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై కన్నేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు అనేక షరతులు పెట్టి మరీ అప్పు ఇస్తుంది ప్రపంచబ్యాంకు. ఇప్పుడు 50 వేల కోట్ల రూపాయల రుణం కావాలంటూ ప్రపంచబ్యాంకుకు దరఖాస్తు చేసింది. ఏపీ సర్కార్ వినతికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉందని సమాచారం. ఏపీ సర్కార్ ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ‘రాజధాని నగరాభివృద్ధి’ పేరిట రుణ ప్రతిపాదనను జగన్రెడ్డి సర్కార్ తెరపైకి తేవడం ఆశ్చర్యం కలిగించకమానదు. ఎందుకంటే.. రాజధాని అమరావతి అభివృద్ధికి అప్పు కోసం ప్రపంచ బ్యాంకును టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. రైతుల ముసుగులో వైసీపీ నేతలు రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేయడం గమనించాల్సిన విషయం. అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో స్వయంగా పర్యటించి, అంతా సక్రమమే అని సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ.. ప్రపంచ బ్యాంకు షరతులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ నాటి టీడీపీ ప్రభుత్వం రుణ ప్రతిపాదనను విరమించుకుంది. ఆ తర్వాత ఇంకెప్పుడూ ప్రపంచ బ్యాంకును రుణం కావాలని అడగకపోవడం విశేషం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వైసీపీ అధికారంలోకి రాగానే ‘రాజధాని అభివృద్ధి’ అంటూ ప్రపంచ బ్యాంకును 50 వేల కోట్ల రుణం ఏ ముఖం పెట్టుకుని అడిగిందనేది జవాబులేని ప్రశ్న. రాజధాని మౌలిక సదుపాయాలకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే నెపం చూపించి అమరావతిని అటకెక్కించింది జగన్ సర్కార్. పరిపాలన వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీ ఆమోదించి రెండేళ్లయిన తర్వాత అవి సమగ్రంగా లేవంటూ ఉపసంహరించుకుంది. ఇదే సమయంలో రాజధాని అభివృద్ధి పేరిట ప్రపంచ బ్యాంకు నుంచి రుణం కోసం ఏపీ సర్కార్ యత్నించడం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. పథకాల నిధులు దారి మళ్లించడంలో, తప్పుడు లెక్కలు చూపించడంలో ఆరితేరిన జగన్ సర్కార్ ఆర్థిక అంశాల విషయంలో విశ్వసనీయత కోల్పోయిందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరైతే ఆ నిధులను రాజధాని అభివృద్ధి కోసమే వినియోగిస్తారా? అనే సందేహం వారు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. ఎన్నో అప్పులు, పలు శాఖల్లోని నిధులు లాగేసుకున్న వైసీపీ సర్కార్ కోర్టుల్లో డిపాజిట్లనూ తీసేసుకుంది. ఏపీలో విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రపంచ బ్యాంకు గతంలో ఇచ్చిన నిధులను దారి మళ్లించింది. దీనిపై ప్రపంచ బ్యాంకు సీరియస్గానే స్పందించింది. కేంద్రంతోనే నేరుగా తేల్చుకుంటానంటూ లేఖ కూడా రాసింది. గ్రామీణ రోడ్ల ప్రాజెక్టుకు ఏఐఐబీ ఇచ్చిన నిధులను తరలించుకుపోయింది. దాంతో తర్వాతి వాయిదా చెల్లింపులను ఏఐఐబీ నిలిపేసిన అంశం గమనార్హం. ఏపీలో ఈఎస్ఐ ఆస్పత్రుల కోసం కేంద్రం ఇచ్చిన నిదులను కూడా వైసీపీ సర్కార్ పక్కదారి పట్టించింది. దీనిపై ఆగ్రహించిన కేంద్ర కార్మిక శాఖ ఏపీ సర్కార్కు లేఖ రాసింది. రాజధాని నగరం ఏదో ఇప్పటికీ తేల్చని జగన్రెడ్డి సర్కార్ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తుంది? ఆ నిధులను నిజంగా అభివృద్ధి కోసమే వినియోగిస్తుందా? లేదంటే యధాప్రకారం వాటిని వేరే అవసరాలంటే పట్టుకుపోతుందా? అనే అనుమానాలకు జవాబు లభించని అంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/ap-government-seek-loan-for-capital-from-world-bank-39-127031.html





