జనాగ్రహంతో మౌనం వీడిన జగన్! స్టీల్ ప్లాంట్ పై ప్రధానికి లెటర్
Publish Date:Feb 6, 2021
Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో కాక రేపుతోంది. విశాఖ ఉక్కు- ఆంధ్రా హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తుండటంపై ఏపీ జనాలు భగ్గుమంటున్నారు. ఏపీ సర్కార్ కేంద్రంతో ఒత్తిడి తేవడంలో విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రం ఇంత చేస్తున్నా వైసీపీ నేతలు కూడా కనీసం మాట్లాడకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఒత్తిడి పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై మరోసారి సమీక్షించాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు. విశాఖ ప్లాంటు కారణంగా 20 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందని, వేలాది మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారని తన లేఖలో సీఎం జగన్ వివరించారు. ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, ఈ భూముల విలువ రూ.1 లక్ష కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది డిసెంబరులో రూ.200 కోట్ల మేర లాభం కూడా వచ్చిందని, వచ్చే రెండేళ్లలో ఇదే ఒరవడి కొనసాగితే ప్లాంటు కోలుకుంటుందని చెప్పారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ప్లాంటును బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని కోరారు.విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా గనులు లేవని, అధిక భారం మోస్తూ ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. సొంతంగా గనులు కేటాయిస్తే ఇతర ఉక్కు పరిశ్రమలతో పోటీ పడే స్థాయికి చేరుతుందని ప్రధాని మోడీకి తాను రాసిన లేఖలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
ఉత్పత్తి వ్యయం భారం కావడం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ కష్టాల్లో చిక్కుకుందని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ వెల్లడించారు. ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు.
http://www.teluguone.com/news/content/ap-cm-written-letter-to-pm-modi-on-vizag-steel-plant-39-109713.html





