మరీ ఇంత మాట తప్పుడా.. జగన్ రెడ్డీ!
Publish Date:Jan 10, 2022
Advertisement
అక్కా చెల్లెమ్మలు, అవ్వా తాతలు, నిరుద్యోగుల్లో ఎన్నెన్నో ఆశలు కల్పిస్తూ ఎన్నికల హామీలు గుప్పించారు ఏపీకి సీఎం కాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీకి రాజధాని అమరావతే అని నమ్మబలికారు. రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను ఊరించారు. కట్టించిన ఇళ్లను ఒక్క రూపాయికే ఇచ్చేస్తామని పేదలు ఉబ్బితబ్బిబ్బయిపోయేలా చేశారు. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు అన్ని వర్గాల ప్రజల్నీ ఊహల మేఘాలపై విహరించేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు. తీరా అధికారం చేట్టి,సీఎంగా అవతారం ఎత్తిన తర్వాత అందరి ఆశల్నీ ఆవిరి చేసేశారు. అనేక విషయాల్లో ఆయన మాట తప్పారు.. మడమ తిప్పేశారు. ‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందంగా జగన్రెడ్డి తీరు మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్కన తాను ఇచ్చిన హామీలు, చేసిన బాసలు గాలికి వదిలేసి.. ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అంటూ ప్రచారం జాస్తిగానే జగన్రెడ్డి చేసుకున్నారనే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ‘ఒక్క అవకాశం’ అంటూ ఏపీ ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకుని, అధికార పీఠం ఎక్కిన జగన్ రెడ్డి మరీ ఇంతగా రివర్స్ అయిపోయారేంటి? అనేది పలువురి నుంచి వస్తున్న ప్రశ్న. వైజాగ్ ఎయిర్ పోర్టులో తనపై జరిగిన కోడికత్తి దాడి నుంచి, తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య, దర్యాప్తు దాకా జగన్ రెడ్డి చెప్పిన మాటలు, చేసిన వ్యవహారాలకు పొంతనే లేదనే ఆరోపణలు పలువురి నుంచి వస్తున్నాయి. దేవుడు ఆశీర్వదించి, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఇది చేస్తాం.. అది చేస్తాం.. మీ అందరి కష్టాలు తీరుస్తానంటూ పాదయాత్రలో జగన్ రెడ్డి వాడవాడలా చెప్పిన మాటల్ని ఆనక అధికారం చేపట్టాక గాల్లో కలిపేశారని ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కతేంటో తేల్చుకుందామని ఒక కచ్చితమైన నిర్ణయానికి వచ్చేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి, ఆయన అనుయాయ గణం ఊరూ.. వాడా డప్పు కొట్టిన చెప్పిన విషయం ‘అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు. అమరావతే రాష్ట్రరాజధాని’ అని. మరి ఎన్నికల ముందు ఇచ్చిన ‘అమరావతి’ రాజధాని ప్రామిస్ ఇప్పుడేమైంది? అంతటితో ఆగని వైసీపీ గణాలు టీడీపీ అధినేత చంద్రబాబుకే అమరావతిలో ఇల్లు లేదని, అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారని, ఎప్పటికైనా ఆయన వలస పక్షే అంటూ దుష్ప్రచారం చేశారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోపై మాట మార్చేశారు. రాజధాని అమరావతిలో మొత్తం కమ్మ సామాజిక వారే అని ప్రచారం చేశారు. వాస్తవం ఏంటంటే.. అమరావతి ప్రాంతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఉందన్న విషయాన్ని వైసీపీ నేతలు, జగన్ రెడ్డి వ్యూహంలో భాగంగానే విస్మరించారనే విమర్శలు ఉన్నాయి. ఆ నియోజవర్గంలో ఎస్సీ, ఎస్టీలు 34 శాతం, రెడ్డిలు 23 శాతం, కమ్మ సామాజికవర్గం 18 శాతం, బీసీలు 14 శాతం ఉన్నారనే అంచనాలు ఉన్నాయి. ఏదేమైతేనేం.. మూడు ముక్కలాట మాదిరిగా రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురవుతున్న తిరుగుబాటు, మొక్కవోని ధైర్యంతో అమరావతి రైతులు ఏడాదికి పైబడి చేస్తున్న దీక్షలు, ఆందోళనలతో తోక ముడిచి.. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు. గత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై జగన్ రెడ్డి,వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. తమ ప్రచారంలో నూరు శాతం నిజం ఉందనే విధంగా జనానికి నమ్మబలికారు. అగ్నికి వాయువు తోడైనట్లు వైసీపీ సోషల్ మీడియా, సొంత మీడియా కూడా వారి అబద్ధపు ప్రచారానికి చిలువలు, పలువలు కల్పించి మరింతగా బాకా ఊదేసింది. చంద్రబాబు హయాంలో ఏపీలో 37 మంది సీఐలను డీఎస్పీలుగా ప్రమోట్ చేశారు. వారిలో 35 మంది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే అంటూ బ్లూ మీడియా ఊదరగొట్టింది. నిజానికి ఆ 37 మందిలో ఇద్దరే కమ్మవారనే వాస్తవాన్ని మరుగున పెట్టి అబద్ధపు ప్రచారం చేశారు. జగన్ పై కోడి కత్తి దాడి వెనుక చంద్రబాబు, డీజీపీ హస్తం ఉందంటూ బ్లూ మీడియాలో ఊదరగొట్టారు. చివరికి 2019 ఎన్నికల ఫలితాల రోజున దాడి నిందితుగు శీనుకు బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందో జనం గమనించాలి. జగన్ బాబాయ్ వివేకా హత్య కేసుసు సీబీఐకి అప్పగించాలని అప్పట్లో జగన్ రెడ్డి, వైసీపీ వాళ్లు డిమాండ్ చేయడం మనందరికీ తెలిసిందే. కానీ తీరా జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ విషయం ఎందుకు నీరుగార్చారో.. ఐబీఐ విచారణ అక్కర్లేదంటూ హైకోర్టులో ఎందుకు అఫిడవిట్ వేశారో బహిరంగ రహస్యమనే చెప్పాలి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరునికి పింక్ డైమండ్ ఉండేదని, అది మాయమైందని, చంద్రబాబు ఇంట్లో ఉంటుందంటూ అప్పట్లో వైసీపీ నేత విజయసాయిరెడ్డి గగ్గోలు పెట్టారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారికి అసలు పింక్ డైమండే లేదని టీటీడీ కార్యనిర్వహణాధికారి ప్రకటించడం గమనార్హం. అంటే పింక్ డైమండ్ బూచి చూపించి చంద్రబాబును అప్రతిష్ట పాలు చేయాలని విజయసాయి తంటాలు పడ్డారనేది గమనార్హం. పింక్ డైమండ్ పై విచారణ అవసరమే లేదని హైకోర్టు తేల్చి చెప్పడం కూడా అది ఒక బూచి అనేది చెప్పకుండనే చెప్పినట్లయింది. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత జగన్ సర్కార్ అనేక మాటలు మార్చింది. నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కూడా జగన్ రెడ్డి మాట తప్పారు. మడమ తిప్పడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ముందొక మాట.. పవర్ లోకి వచ్చిన వెంటనే మాట మార్చిన జగన్ నైజాన్ని ఏపీ ప్రజలు ఇప్పటికే నిశితంగా గమనించారని రాజకీయ విశ్లేకులు చెబుతున్న మాట. అవ్వా తాతలకు 3 వేలు పింఛన్ ఇస్తానని నమ్మబలికిన జగన్ రెడ్డి ఆనక ఆ మాటను సానుకూలంగా తప్పారు. పేదోళ్ళకు ఇళ్ల విషయంలో కూడా రూపాయికే ఇస్తామని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఓటీఎస్ పేరుతో పేదల నుంచే కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు సిద్ధమైపోయారు. దీంతో పేదల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మద్య నిషేధం అమలు చేస్తామని అక్క చెల్లెమ్మలకు హామీ ఇచ్చి జగన్ రెడ్డి ఆనక మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి వారిపై మరింత ఆర్థిక భారం వేయడం కూడా మడమ తిప్పడం, మాట తప్పడమే కదా అనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద జగన్ సర్కార్ ఏలుబడిపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందనే చెప్పాలి.
http://www.teluguone.com/news/content/ap-cm-jagan-back-steps-on-his-promises-39-129968.html





