ఏపీ సీఎం.. ఐదు రోజులు.. నాలుగు జిల్లాల పర్యటన!
Publish Date:Jun 29, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం వచ్చేనెల 1 (జులై1) నుంచి ఐదు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అధికారిక పర్యటన షెడ్యూల్ వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆయన ఐదు రోజుల్లో నాలుగు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు లబ్థిదారులకు అంద జేస్తారు. అదే రోజు తిరుపతి చేరుకుని అక్కడి శ్రీసిటీలో.. హీరో మోటో కార్ప్ సుమా . 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే బస చేస్తారు. ఆ మరుసటి రోజు ఆయన తిరుపతి నగరం, రైల్వే కోడూరురైలో పర్యటిస్తారు. రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం తిరుపతి నగరంలో జరిగే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. ఈ సదస్సుకు నీతి ఆయోగ్ సభ్యుడు, పీఎం ఆర్థిక సలహా మండలి సభ్యులు హాజరుకానున్నారు. రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు. ఆ మరుసటి రోజు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ (ఉక్కు కర్మాగారం) పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడతారు. అనంతరం అదే రోజు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం చేరుకుంటారు. జులై4, 5 తేదీలలో చంద్రబాబు కుప్పంలోనే బస చేస్తారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకుంటారు. జులై 5న పర్యటన ముగించుకుని తిరిగి అమరావతికి చేరుకుంటారు.
http://www.teluguone.com/news/content/ap-cm-cbn-tour-districts-tour-36-224497.html





