అంబటి అపార్ట్‌మెంట్‌కు మరో గండం
Publish Date:Mar 3, 2025
Advertisement
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణకు చెందిన గుంటూరులోని గ్రీన్‌గ్రేస్ అపార్టుమెంట్‌కు పర్యావరణ మంత్రిత్వశాఖ ఝలక్ ఇచ్చింది. ఆ నిర్మాణానికి గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను నిలుపుదల చేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందే రాష్ట్ర పీసీబీ అధికారులు ఆ నిర్మాణానికి తమ అనుమతి లేదని, పనులు నిలిపివేయాలని జనవరి 9న ఆదేశాలిచ్చారు. అయినా గుంటూరు నగరపాలక సంస్థ స్టాఫ్ ఆర్డర్ ధిక్కరించి ఇటీవల ఓ ఫ్లాట్ పనులు పూర్తిచేసి గృహప్రవేశం చేయించడం వివాదాస్పదమైంది. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ లోపే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 20 వేల చదరపు మీటర్లకు పైబడిన స్థలంలో నిర్మాణం చేపట్టాలంటే... పర్యావరణ అనుమతులు తప్పనిసరి. నిబంధనల మేరకు నిర్మాణం చేపడతామని, మొక్కలు పెంచుతామని చెప్పి.. అమలు తీరును ప్రతి ఆరు మాసాలకు ఒకసారి పంపాలి. గ్రీన్‌గ్రేస్ భవన నిర్మాణదారుడు ఆ వివరాలేవీ సమర్పించలేదు. పైగా పీసీబీ నుంచి కన్సెంట్ టు ఎస్టాబ్లిష్‌మెంట్ పొందకుండా నిర్మిస్తున్నారని రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ గుర్తించి నివేదిక పంపింది. పర్యావరణ అనుమతులు పొందాక పీసీబీ నుంచి సీటీఈ తీసుకుని పనులు ప్రారంభించాల్సి ఉండగా.. అదేం లేకుండా నిర్మాణం చేపట్టడాన్ని ఉల్లంఘనగా భావించింది.
http://www.teluguone.com/news/content/another-shock-to-ambati-39-193733.html





