ఫోన్ ట్యాపింగ్ లో మరో ఆసక్తికర పరిణామం... బాధితుల్లోజర్నలిస్ట్ లు
Publish Date:Jul 24, 2024
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇప్పటివరకు విచారణలో తేలగా తాజాగా జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు తేలింది. ఈమేరకు విచారణ అధికారులు జర్నలిస్టులకు సమాచారం అందించారు. ఏకంగా 36 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది.
సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకారం బిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీకి 70 ఎకరాలు అప్పగించాలి, కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయే వరకు కూడా ఆ స్థలాలు అప్పగించలేదు.సుప్రీం తీర్పు తర్వాత టీం జెఎన్ జె బృందం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా, అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేత పేట్ బషీర్ వద్ద ధర్నా చేపట్టడం వంటి కార్యక్రమాలను టీం జెఎన్ జె చేపట్టింది. పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి, మల్లురవి వంటి నేతలు టీం జెఎన్ జెకు సంఘీభావం తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో జెఎన్ జె హౌజింగ్ సొసైటీ ఎన్నికలు జరగలేదు. ఈ ఎన్నికలు జరుగకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత టీం జెఎన్ జె సభ్యులైన రమణారావు, అశోక్ రెడ్డిలు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. జెఎన్ జె హౌజింగ్ సోసైటీ ఎన్నికల్లో అత్యధిక వోట్లతో రమణారావ్ గెలుపొంది చర్చనీయాంశమయ్యారు. టీం జెఎన్ జె సభ్యులైన రమణారావ్, అశోక్ రెడ్డి, హసన్ షరీఫ్, బోడపాటి శ్రీనివాస్, నాగభూషణరావు ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం. ఫోన్ ట్యాప్ కు గురైన జర్నలిస్టులకు ఫోన్లు చేసి పోలీసులు అసలు విషయం చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. గతేదాది మార్చి నుంచి అక్టోబర్ వరకు జర్నలిస్టుల కాల్ డేటా గురించి పోలీసులు క్షుణ్ణంగా వివరించడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారని సమాచారం. పోలిసుల సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు వెళ్ళిన కొంతమంది జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయా..? అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరితో ఎక్కడ మాట్లాడారు..? ఎంతసేపు మాట్లాడారు..? ఎక్కడెక్కడ ప్రయాణించారు..? అనే విషయాలను పోలీసులు స్పష్టంగా వివరించడంతో జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయని నిర్ధారణకు వచ్చారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టులలో ఎవరికైనా నాటి ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వేధింపులు ఎదురయ్యాయా..?అని జర్నలిస్టులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు వినియోగించుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ బీట్ చూసే జర్నలిస్టులను టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులే కాకుండా పత్రికల్లో పని చేసే జర్నలిస్టులపై కూడా నిఘా పెట్టారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టులను పిలిచి…ఈ అంశంపై మీద ఫిర్యాదు చేయాలనుకుంటే దర్యాప్తు చేపడుతామని పోలీసులు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/another-interesting-development-in-phone-tapping-tnjj-journalists-are-among-the-victims-25-181434.html





