వైసీపీ సర్కార్ బరితెగింపునకు మరో నిదర్శనం
Publish Date:Nov 22, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం అరాచకం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుని వైసీపీయులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. పార్టీ కోసం పని చేసే వారికి దొడ్డిదారిన ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేసి.. ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. తన కోసం, తన ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారినీ, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్య పోస్టులు పెట్టీ, ఫోటోలు మార్ఫ్ చేసీ వేధింపులకు గురి చేసిన వారికీ పెద్ద పీట వేశారు. అనర్హులకు కూడా ప్రభుత్వం తరఫున వేతనాలు చెల్లించేశారు. మొత్తంగా జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయాయి. నిబంధనలు అనేవి ఉంటాయన్న సంగతే ఆయా వ్యవస్థల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులు సైతం మరచిపోయారా అన్నట్లుగా అప్పట్లో పరిస్థితి ఉండింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమై రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత నాడు జరిగిన తప్పులు, అవకతవకలు, అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ కు కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇచ్చే అక్రిడెషన్ కు ఇచ్చి మరీ రాచమర్యాదలు చేసిన విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఇంటూరి రవి కిరణ్ ఎవరంటే.. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అత్యంత అసభ్య పోస్టులను పెట్టే మొనగాడు. జగన్ భజన, జగన్ సర్కార్ వ్యతిరేకులపై అసభ్య పోస్టులు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోవడంలో ఇంటూరీ ఆరితే రిపోయారు. ఆయన కృషి, ప్రత్యర్థులపై అసభ్య, అసహ్యకర పోస్టులు పెట్టడంలో ఆయన సృజన జగన్ ను మెప్పించింది. దాంతో ఆయన పనికి మెచ్చిన జగన్ తన హయాంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నెలకు 73 వేల రూపాయల భారీ వేతనాన్ని చెల్లించే ఏర్పాటు చేశారు. తన భజన చేసినందుకు, తన ప్రత్యర్థుల వ్యక్తిత్వహననానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ప్రజాధనాన్ని ఇంటూరికి జగన్ అప్పనంగా దోచి పెట్టేశారన్న మాట. అయితే అక్కడితో ఆగలేదు.. అర్హులైన జర్నలిస్టులకు కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టి మరీ నిరాకరించిన అక్రిడేషన్ ను ఎలాంటి అర్హతలూ లేని ఇంటూరి రవికుమార్ కు అతి సునాయాసంగా జారీ అయిపోయింది. డిజిటల్ కార్పొరేషన్ నుంచి అప్పనంగా వేతనం అందుకుంటూ, ఆ సంస్థ పే రోల్ లో ఉన్న ఇంటూరి రవికుమార్ కు జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ ఎందుకు ఇచ్చారంటే.. పాపం పౌరసరఫరాల శాఖ మాత్రం ఏం చెప్పగలదు? పైవాడు ఆదేశించాడు.. మేం ఆచరించామని బిక్కముఖం వేసుకోవడం తప్ప. జగన్ హయాంలో వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలు ఎంతగా దిగజారి వ్యవహరించాయో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. అయితే జగన్ హయాంలో జరిగిన పాపాల పుట్ట పగులుతోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులతో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా కేసులు, అరెస్టులు వెంటాడుతున్నాయి. ఇంటూరి ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారు. ఇక నిబంధనలకు తిలోద కాలిచ్చేసిన అధికారుల వంతు రానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/another-example-for-jagan-anarchy-39-188785.html