పార్టీ పగ్గాల కోసం కవిత కేటీఆర్ మధ్య పోటీ.. బీఆర్ఎస్ లో మరో సంక్షోభం?
Publish Date:Jan 2, 2025
Advertisement
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా రాజకీయాలకు దూరంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఇది పార్టీ క్యాడర్ విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరింత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కనీసం ఒక్క లోక్ సభ స్థానంలోనూ విజయం సాధించలేకపోవడమే కాకుండా, ఓటు బ్యాంకును కూడా భారీగా కోల్పోయింది. ఇక కేసీఆర్ ఇన్ యాక్టివ్ అయిన సమయంలో పార్టీని నడిపిస్తున్న ఆయన తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనదైన ముద్ర చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలు పెద్దగా ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. రుణమాఫీ, రైతు భరోసా, అలాగే ఎన్నికల హామీల అమలులో రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టడంలో కేటీఆర్ నాయకత్వం విఫలమైందన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఒక పక్క కేటీఆర్ తన నాయకత్వ పటిమను చాటుకోవడంలో విఫలమౌతున్న సమయంలోనే, పార్టీకి మరో సారి నాయకత్వ సంక్షోభం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేశాయి. విచారణకు రావలసిందిగా నోటీసులు కూడా జారీ చేశాయి. ఈ కేసులో కేటీఆర్ అరెస్టయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో మరోసారి బీఆర్ఎస్ నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీష్ రావు ఉన్నప్పటికీ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో కేసీఆర్ కానీ, ఆయన పిల్లలు కేటీఆర్, కవితలు సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ రాజకీయవారసత్వాన్ని అందుకోవాలన్న అభిలాషను కల్వకుంట్ల కవిత వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కొన్ని నెలల పాటు తీహార్ జైలులో ఉండి బెయిలుపై విడుదలైన తరువాత కవిత చాలా కాలం స్తబ్దుగా ఉన్నారు. ఆమె కూడా రాజకీయాలకు దూరమౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే జైలు నుంచి విడుదలై వచ్చిన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న కవిత ఇప్పుడు మళ్లీ చురుకుగా రాజకీయాలలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా ఇటీవల ఆమె నిజామాబాద్ పర్యటించిన సందర్భంలో ఆమె అభిమానులు సీఎం కవిత, సీఎం కవిత అన్న నినాదాలు చేయడం ఆమె తండ్రి రాజకీయ వారసురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టాలని అభిలషిస్తున్నట్లు స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా అంటే ఆమె బెయిలుపై విడుదలై హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా సీఎం కవిత అన్న నినాదాలు వినిపించాయి. దీనికి కౌంటర్ అన్నట్లుగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను కేటీఆర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మద్దతు దారులు సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంఘటనలను బట్టి పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టే విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ కేసీఆర్ కుటుంబంలో ఈ తగాదా ఉందనీ, కవిత, కేటీఆర్ ల మధ్య కేసీఆర్ నలిగిపోయారనీ అప్పట్లో పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయిన సందర్భంలో పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవితల మధ్య పోటీ ఎంత వరకూ వెడుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
http://www.teluguone.com/news/content/another-crisis-in-brs-25-190722.html