హైదరాబాద్ నెత్తిన వాటర్ బాంబ్.. మరో 5 రోజుల పాటు అలర్ట్..
Publish Date:Sep 5, 2021
Advertisement
ఒకప్పుడు పొద్దంతా ఎండకొట్టేది. రాత్రి అయ్యాక వర్షం పడేది. మళ్లీ మార్నింగ్‌కల్లా అంతా సాఫ్. ఎవరి పనులు వాళ్లు చేసుకొనేవాళ్లు. నైట్ వాన వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ, కాలం మారింది. కాలచక్రం కకావికలం అయింది. పగలు-రాత్రి తేడా లేకుండా రోజంతా వర్షం పడుతూనే ఉంది. రోజులు, వారాల తరబడి రెయిన్ కుమ్మేస్తోంది. వరద పోటెత్తుతోంది. హైదరాబాదీలను పరేషాన్ చేసేస్తోంది. భాగ్యనగరాన్ని పట్టిన ముసురు ఇంకా వీడనే లేదు. మూడు రోజులుగా నాన్‌స్టాప్ రెయిన్ నగరాన్ని రొచ్చు రొచ్చుగా మార్చేసింది. వరద నీరు, డ్రైనేజీ వాటర్ అంతా కలిసి కంపు రేపుతోంది. సడెన్‌గా కురుస్తున్న వర్షంతో ట్రాఫిక్ జామ్‌లు, వాహనదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఎప్పుడూ అంచనాలు తప్పే వాతావరణ శాఖ ఈసారి మాత్రం కరెక్ట్‌గానే గెస్ చేసినట్టుంది. అది చెప్పినట్టుగానే రోజూ వాన కురుస్తోంది. మరో ఐదు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది వెదర్ రిపోర్ట్. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భారీ వానలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరంలోని వివిధ ప్రాంతాలను ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్లపై నిలిచిన నీళ్లను తొలగిస్తున్నారు. కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గండిపేట జలాశయం పూర్తిగా నిండటంతో నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువన మూసీ నదిలోకి వదిలిపెట్టారు. భారీ వర్షాలతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలాశయం నీటి మట్టం 1788.88కు చేరింది. గండిపేటకు ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు వస్తోంది. నాలుగు గేట్ల ద్వారా 400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. 2010 తర్వాత ఈ ఏడాదే గండిపేట, హిమాయత్‌సాగర్ గేట్లు రెండుసార్లు ఎత్తారంటే.. వానలు ఏ రేంజ్లో కురుస్తున్నాయో తెలుస్తోంది. మరో 5 రోజులు వర్షాలు ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటే మంచిది.
http://www.teluguone.com/news/content/another-5-days-rain-alert-for-hyderabad-39-122528.html





