రాజధానిపై ప్రభుత్వం పునరాలోచన?
Publish Date:Jul 30, 2014
Advertisement
రాష్ట్ర రాజధానిని గుంటూరు-విజయవాడ ప్రాంతం మధ్య ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు చాలా మంది సానుకూలంగా ఉన్నప్పటికీ, అక్కడ రాజధాని ఏర్పాటులో ఉండే కష్టనష్టాలను, సమస్యలను శివరామ కృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించడంతో ఆయన పునరాలోచనలోపడినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో, ఒకవేళ అక్కడే రాజధానిని ఏర్పాటు చేయదలిస్తే తప్పనిసరిగా ప్రైవేట్ మరియు వ్యవసాయ భూములను భారీ మూల్యం చెల్లించి కొనవలసివస్తుంది. ఒకప్పుడు ఎకరం 20-30 లక్షల మధ్య ఉన్న ధరలు, ప్రభుత్వం అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలియగానే, కేవలం నెలన్నర రోజుల వ్యవధిలోనే భూముల ధరలు అమాంతం పెరిగిపోయి ప్రస్తుతం రూ.50-75లక్షల మధ్య ఉన్నట్లు శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులే స్వయంగా ద్రువీకరించారు. రాజధాని ఏర్పాటుకి కనీసం 20-25వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని ప్రాధమిక అంచనా. ఆ ప్రకారం చూసుకొంటే భూమి కొనుగోలుకే ప్రభుత్వం చాలా భారీ మొత్తం వెచ్చించవలసి ఉంటుంది. అసలే లోటు బడ్జెటుతో, తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమవుతున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం అంత భారీ మొత్తం నిధుల సమీకరానా దాదాపు అసంభవమే అవుతుంది. రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఉదారంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఏ మేరకు ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి. కనుక రాజధాని విషయంలో చంద్రబాబు పునరాలోచనలోపడినట్లు మంత్రుల తాజా స్టేట్ మెంటులే పట్టిస్తున్నాయి. ఒకవేళ రాజధాని ఆ ప్రాంతంలోనే నిర్మించినప్పటికీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయము, సచివాలయము, ముఖ్యమయిన కొన్ని ప్రభుత్వభవనాలను మాత్రమే నిర్మించి, శాసనసభ, విధానసభ, హైకోర్టు వంటి వాటినన్నిటినీ వేరే ప్రాంతాలలో లేదా పరిసర జిల్లాలలో ఏర్పాటు చేస్తే ఎలాగుంటుంది? అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వంపై ఆర్దికభారం తగ్గించుకోగలగడమే కాకుండా రాజధాని కోసం వివిధ జిల్లాల డిమాండ్లను అంగీకరించినట్లవుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలో అన్నిజిల్లాలు సమానంగా అభివృద్ధి సాధించగలుగుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. శివరామ కృష్ణన్ కమిటీ కమిటీ వచ్చే నెల 20లోగా తన తుది నివేదిక సమర్పిస్తుంది. కనుక దానిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని గమనించినట్లయితే, బయట నుండి భారీ ఆర్ధిక సహాయం లేకుండా తనంతట తానుగా గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయడం దాదాపు అసంభవమేననిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/andhra-pradesh-new-capital-45-36644.html





