బాబు కేబినెట్ నుంచి ఔటయ్యేది వీళ్లే..?
Publish Date:Apr 13, 2016
Advertisement
రాష్ట్ర మంత్రివర్గంలోకి లోకేశ్, బాలయ్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్న తరుణంలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తప్పదని తెలుగుదేశం పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కీలక మార్పులకు సమయం ఆసన్నమైందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటి నుంచి సీఎం దీనిపై కసరత్తు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రన్న ఎవరిని కరుణిస్తారో..ఎవరిపై వేటు వేస్తారో తెలియక మంత్రులు, ఎమ్మెల్యేలు కిందా మీదా పడుతున్నారు. కొత్తగా మంత్రులుగా తీసుకోవాలంటే ఉన్నవారిలో ఎవరో ఒకరిని తప్పించాలి..అలా తప్పించేవారిలో ముందు వరుసలో ఉండేది అనంతపురం జిల్లాకు చెందిన పల్లె రఘునాథరెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిశోర్ బాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాత, విజయనగరం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ఇంటర్నల్‌గా చేయించిన సర్వేల్లో వీరికి పాస్ మార్కులు రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఐటీ, సమాచారశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన పల్లె అధికార యంత్రాంగంపై పట్టు సాధించలేకపోయారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వరుస టూర్లు, సదస్సులతో ఆ రాష్ట్రానికి ఐటీ రంగంలో పెట్టుబడులు సాధించారు. కాని పల్లె విషయంలో ముందడుగు శూన్యం. గుంటూరు జిల్లాకు చెందిన దళిత నేత రావెల కిశోర్ బాబు సంగతి చూస్తే తాను ఇంకా ప్రభుత్వ అధికారిగానే ఫీలవుతున్నారు. ఎవరైనా పనిమీద తనను కలవాలని వస్తే వారికి అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదు. దానికి తోడు ఆయన గారి కుమారుడు హైదరాబాద్‌లో ఓ మహిళను బలవంతంగా కారులోకి లాగడంతో ఉన్న పరువు కాస్తా పోయింది. ఇక పీతల గారి సంగతి చూస్తే ఈవిడ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుజాత వల్ల బాబు తలబొప్పికట్టిపోయింది. మహిళా సంక్షేమం తర్వాత గాని ముందు నా సంక్షేమం సంగతేంటి అనే టైపు. కాంట్రాక్టర్లకు భారీగా లబ్థి చేకూర్చినందుకు గానూ వారు కూడా భారీ వడ్డాణం కానుకగా ఇచ్చారు. ఇది అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు ఆయుధమైంది. రోజా అయితే వడ్డాణం మంత్రి అంటూ ఏకీపారేశారు. ఉత్తరాంధ్రకు చెందిన మహిళా నేత కిమిడి మృణాళిని ప్రతి విషయంలో ఆచితూచి స్పందిస్తారు. ఆ నిదానమే ఆమె మంత్రిపదవికి ఎసరు తెచ్చింది. అధికారులు, సిబ్బంది పట్ల మృణాళిని మెతగ్గా వ్యవహరిస్తుండటంతో వారు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు తయారైంది. వీరిని ఇలాగే కొనసాగిస్తే పాలన గాడి తప్పడంతో పాటు పార్టీ పరువు గంగలో కలిసిపోతుందని భావిస్తున్న ముఖ్యమంత్రి వీరి స్థానంలో బలమైన, సమర్ధులైన వారిని నియమించాలని కసరత్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/andhra-pradesh-cabinet-ministers-45-58433.html





